కృష్ణకాలనీ, మే 31 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆముదాలపల్లి అటవీ ప్రాంతంలో కొంతమంది పోడుపేరుతో భూమిని సాగుచేస్తున్నారని తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. కమలాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తోట సంతోష్, ఆయన కొడుకు తోట రంజిత్ డోజర్ ట్రాక్టర్‌తో ఆదివారం ఉదయం దర్జాగా అటవీ భూమిని పోడుపేరుతో చదును చేస్తున్నారు. గమనించిన బీట్ ఆఫీసర్లు అక్రమంగా చదును చేయొద్దని, వెంటనే పనులు ఆపాలని కోరారు.
అయినా వినకుండా తాము అధికార పార్టీ నేతలం.. అంటూ అధికారులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. అటవీశాఖ అధికారులు చదును చేస్తున్న డోజర్ ట్రాక్టర్‌ను అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ నేతలు బీట్ ఆఫీసర్ రాజేందర్ ముఖంపై రక్తం వచ్చేలా కొట్టారు. మరో బీట్ ఆఫీసర్ రంజిత్ బట్టలు చించి పిడిగుదులు కురిపించారు. కాంగ్రెస్ నేతలు తోట సంతోష్, తోట రంజిత్‌పై అధికారులు ఫిర్యాదు చేశారు. డోజర్‌ను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.