కల్వకుర్తి, జనవరి 28 : మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులపై కాంగ్రెస్ నేత చెయ్యెత్తిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. సోమవారం రైతులు పల్లి విక్రయించేందుకు కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున వచ్చారు. మూడు రోజుల్లోనే ధర రూ.600 నుంచి రూ.800 వరకు తగ్గడంతో ఆందోళనకు గురయ్యారు. వ్యాపారులు కుమ్మక్కై ధరలను తగ్గించినా మార్కెట్ పాలకమండలి, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్కెట్ కమిటీ ఎదురుగా హైదరాబాద్ చౌరస్తాలో బైఠాయించి రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సరిగ్గా అదే సమయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి వంగూరు మాజీ జెడ్పీటీసీ, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి ధర్నా ప్రాంతానికి వచ్చారు.
రైతులను శాంతపరిచే ప్రయత్నం చేశారు. అతడిని చూసిన కర్షకులు మరింత జోరుగా నినాదాలు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధర ఏమాయే? రైతు భరోసా ఏమాయే? అంటూ ప్రశ్నించారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం.. సీఎం డౌన్‌డౌన్ అంటూ నినదించారు. కేసీఆర్ పాలనే బాగుందని అన్నారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన కేవీఎన్ రెడ్డి రైతులపై చేయిచేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంతమంది రైతులను కొడ్తావో కొట్టు అంటూ ఆయనపైకి ఎగబడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు రైతులను అడ్డగించి కేవీఎన్ రెడ్డిని పక్కకు తీసుకెళ్లారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. కేవీఎన్ రెడ్డి తీరును నిరసిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది. గ్రామాలు, మండలాలు, రైతుల గ్రూపుల్లో ఈ వీడియో జోరుగా ఫార్వర్డ్ అవుతున్నది. వీడియోను చూసిన వారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే రైతులపై చెయ్యెత్తుతారా? అంటూ రైతుల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.