మహబూబ్‌నగర్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ నారాయణపేట జిల్లా మాజీ అధ్యక్షుడు ఓ మహిళపై రెండేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్న ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కేసు నమోదైంది. బెంగళూరు నగరంలోని ఓ స్టార్ హోటల్లో కుంభం శివకుమార్‌రెడ్డి తనపై లైంగికదాడి చేసినట్టు బాధితురాలు లిఖితపూర్వకంగా కబ్బన్ పార్క్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఈ నెల 26న 144/2023 ఎఫ్ఐఆర్ నమోదైంది. రెండేండ్లుగా తనపై అత్యాచారం చేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. శివకుమార్రెడ్డితోపాటు ఆయన అనుచరులు లక్ష్మీకాంత్, నరసింహారెడ్డిలపై కూడా కేసు నమోదైంది. గతంలోనూ శివకుమార్‌రెడ్డి ఇదే విధమైన ఆరోపణను ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో తమ నాయకుడికి బెయిల్ లభించిందని ఆ పార్టీ నాయకులు చెప్తుండగా.. ఇప్పుడు కబ్బన్ పార్క్ పోలీస్‌స్టేషన్‌లో మరో అత్యాచారం కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఎన్నికల వేళ ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.