యాదగిరిగుట్ట, జూలై 11: నిరుద్యోగులకు నెలకు రూ.5 వేల చొప్పున భృతిని ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. డీఎస్సీని వాయిదా వేయాలన్న నిరుద్యోగుల దీక్షపై పోలీసుల దాడి చేయడం బాధాకరమని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గురువారం ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం పట్టణంలో మీడియాతో మాట్లాడారు. పరిపాలనలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లకే పరిమితం కావడం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోవడమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో 80 లక్షల మంది దళితులు ఉంటే ఒక్కరికి కూడా సీటు ఇవ్వకపోవడం సరికాదని అన్నారు.
నీతివంతమైన పాలన సాగించిన తనకు ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఫొటోను తనతో సమానంగా అధికార కార్యాలయాల్లో బిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారని గుర్తుచేస్తూ.. తెలంగాణలోనూ సీఎం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అంతే గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు.