Operation Meenakshi | తెలంగాణ రాజకీయాల్లో, పాలనావ్యవస్థలో ఇప్పుడు ఎటుచూసినా ఓ నీడ కదలాడుతున్నది. ఇందుగలడందు లేడని సందేహము వలదు.. అన్నట్టుగా ప్రతిదాంట్లో అది వేలు పెడుతున్నది. ప్రతి నిర్ణయంలో తలదూర్చుతున్నది. ఇప్పుడు ఆ నీడ జాడ లేకుండా ప్రభుత్వ విభాగాల్లోకానీ, అధికారపార్టీలోకానీ ఏ ఒక్క పనీ జరుగని పరిస్థితి. కీలకమైన నిర్ణయాల మొదలు దందాలు, ధమ్కీలు, సెటిల్మెంట్లు అన్నింటా ఆ ‘షాడో ప్లే’ కొనసాగుతున్నది. అందాల పోటీల నుంచి, ఫుట్‌బాల్ ఆటలదాకా.. అధికారుల బదిలీల నుంచి.. ప్రత్యర్థుల వేధింపుల వరకు.. అన్నింటా ఆ నీడే తారాడుతుంది. రాష్ట్రంలో ఏ వివాదం తెరమీదికి వచ్చినా ఆ పేరే వినపడుతున్నది.
సీసా బిరడా తీసి, భూతాన్ని పైకి లేపిందీ.. ‘ఖుల్జా సిమ్ సిమ్’ అంటూ మాయా సొరంగాన్ని తెరిచిందీ మాత్రం ముఖ్యనేతే. బురద చిమ్మాలన్నా.. నీళ్లు చల్లాలన్నా.. విషం కక్కాలన్నా.. ఇప్పుడా నీడే ముఖ్యనేతకు తోడు. ఇద్దరూ కలిసి ఆడింది ఆట.. పాడింది పాట! ప్రభుత్వం లేదు.. పాలన లేదు.. ప్రజలపై పట్టింపులేదు.. వ్యక్తిగత లాభనష్టాలే పరమావధి. ముఖ్యనేత ఆదేశాలను ఆత్మ అమలు చేస్తుంది. ఆత్మకు ఆపదొస్తే ముఖ్యనేత ముందుకొస్తడు. తెరచాప చందం ఆ తెరచాటు బంధం.
అధికారులంటే విలువలేదు.. మంత్రులంటే పట్టింపులేదు.. పార్టీ అంటే గౌరవం లేదు.. నిబంధనలంటే లెక్కలేదు.. అన్ని వ్యవస్థలనూ అమాంతం మింగే రాజ్యాంగేతర శక్తి అది. రాజకీయం, అరాచకీయం కలిసి పెంచిన రాకాసి అది. వారి ఆటలో పావులెందరో! వారి చేతిలో బాధితులెందరో! తమ స్వార్థం కోసం ఎవరినైనా బలి పెట్టడానికి వెనుకాడని ఆ గలీజు జుగల్బందీపై వరుస కథనాలను ‘నమస్తే తెలంగాణ’ మీ ముందుకు తెస్తున్నది. ‘ఆపరేషన్ సక్సెస్.. మీనాక్షి ఫెయిల్’కి సంబంధించిన ఈ ఎపిసోడ్.. నేటినుంచి మొదలయ్యే ధారావాహికలో తొలి కథనం..
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్‌పై పథకం ప్రకారం కుట్ర పన్నారా? అదను చూసి ఆమె భవితపై దెబ్బకొట్టారా? రాజ్యసభ సీటు చేజారేలా అంతర్రాష్ట్ర ఆపరేషన్ నడిపించారా? వీటన్నింటికీ అవుననే సమాధానమే వినవస్తున్నది. ముఖ్యనేత, ఆయన ‘ఆత్మ’ తెరవెనుక సాగించిన ఆపరేషన్ ఆలస్యంగా బయటపడి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. తన వ్యవహారాలన్నీ చక్కదిద్దే అనుచరుడికి మంచి పొజిషన్ ఇప్పించాలని ముఖ్యనేత చాలారోజులుగా తాపత్రయపడుతున్నారు. మొదటిసారి ఎమ్మెల్సీ కోసం ప్రయత్నించగా.. మీనాక్షి అడ్డుకట్ట వేశారు.
చివరికి ‘ఆత్మ’ ఆశించిన ఎమ్మెల్సీ పదవి బంజారాహిల్స్ ఉపఎన్నికల పుణ్యమా అని అజారుద్దీన్‌కు దక్కింది. ముఖ్యనేత అండతో రెండోసారి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ఆ ‘షాడో’ ప్రయత్నించింది. అక్కడ కూడా ఢిల్లీ దూత రూపంలో అడ్డంకే ఎదురైంది. ఆ ఆశలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి నెరవేరనీయలేదు. దీంతో మీనాక్షిపై కోపం పెంచుకున్న వాళ్లు.. సమయం కోసం ఎదురుచూశారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక ముందుకు రాగానే.. తమ రివేంజ్‌కు రంగం సిద్ధంచేశారని తెలుస్తున్నది. మీనాక్షి గెలిస్తే.. ఆమె మరింత పవర్‌పుల్ అవుతారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని మరింత ప్రభావితం చేస్తారని, తెలంగాణ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు ఢిల్లీ సమాచారమిచ్చే వ్యవస్థ పటిష్టంగా తయారవుతుందని.. తన బాస్ వద్ద సదరు ‘ఆత్మ’ ఘోషించింది. ముఖ్యనేత ఆలోచనలో పడ్డాడు.
ఆత్మ అంతటితో ఆగలేదు. బీజేపీకి రాజ్యసభలో ఒక్కో సీటు ప్రాణప్రదంగా ఉన్నదని, ఇలాంటి తరుణంలో మీనాక్షి ఓడిపోయి, బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్టేనని సలహా ఇచ్చింది. బీజేపీ గెలిస్తే.. కేంద్రం పెద్దల అభిమానం మరింతగా చూరగొనవచ్చునని పాచిక విసిరింది. ముఖ్యనేత నమ్మేశాడు. ఆపరేషన్‌కు తలూపాడు. ఇద్దరూ కలిసి సొంత పార్టీ ఢిల్లీ దూతను రాజకీయంగా గొంతుకోశారు.
ముఖ్యనేత మార్గనిర్దేశనంలో.. ఆయనకు ఆత్మగా మెలిగే నాయకుడు, షాడో సీఎంవోలోని కీలక వ్యక్తే మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు మీనాక్షిపై నమోదైన కేసులో కోర్టు సమన్ల పత్రాలను అందించారని కాంగ్రెస్ అంతర్గత పరిశీలనలో తేలినట్టు సమాచారం. దీంతో మీనాక్షి నామినేషన్ రద్దు వ్యవహారం కాకతాళీయంగా జరుగలేదని, పక్కా ప్రణాళికతోనే ఆపరేషన్ పూర్తి చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తున్నది.
ఇటీవల రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రికి రాజకీయ ఆక్సిజన్ అందించటంతోపాటు, తన శిష్యుడికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాకుండా అడ్డుకున్నందుకు మీనాక్షిపై పగ తీర్చుకునేందుకే కోర్టు సమన్లు లీక్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలున్నాయి. లీక్ రాజకీయాలు నడుస్తున్నాయి. పత్రాలు తెలంగాణ నుంచి వచ్చాయి.. అకడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది.. అంటే సమాచారం కాంగ్రెస్ వర్గాల నుంచే బయటకు వచ్చి ఉండొచ్చు’ అని మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయ్‌వర్గీయ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ చేపట్టిన అంతర్గత విచారణలో ఇంటిదొంగ గుట్టు రట్టయినట్టు సమాచారం.
మహారాష్ట్ర న్యాయవాదుల సూచనలతో అక్కడి ముఖ్యనేత మరింత చురుకుగా వ్యవహరించి, ఇటు తెలంగాణ నేతలతో, అటు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలతో సంప్రదింపులు చేసినట్టు సమాచారం. సాధారణంగా రాజ్యసభ ఎంపీ పదవికి నామినేషన్ వేసే సమయంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అలర్ట్ అవుతుంది. పైగా మీనాక్షీ నటరాజన్ వంటి కీలక నేత విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ దగ్గరుండి చూసుకున్నది. అలాంటిది మీనాక్షి విషయంలో ఎక్కడ పొరబాటు జరిగిందో ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు పరిశోధించి, గుర్తించినట్టు సమాచారం.
మీనాక్షిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీగల్‌సెల్ అలర్ట్ అయ్యిందట. ఆమె నామినేషన్ పత్రాలు నింపటానికి అవసరమైన ఏర్పాట్లు చేసిందట. అయితే ఇక్కడే మహారాష్ట్ర ముఖ్యనేత చక్రం తిప్పినట్టు చెప్తున్నారు. ఆయన సూచన మేరకు తెలంగాణ ముఖ్యనేత రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్‌ను తాత్కాలికంగా షట్‌డౌన్ చేసినట్టు సమాచారం. నామినేషన్ సంగతి మన లీగల్‌సెల్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మధ్యప్రదేశ్ వాళ్లు చూసుకుంటారని తెలంగాణ ముఖ్యనేత చెప్పినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
నామినేషన్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ జోక్యం చేసుకోవడం లేదని నిర్ధారించుకున్న తర్వాత మహారాష్ట్ర ముఖ్యనేత మధ్యప్రదేశ్‌లో కొఠారి, భోపాల్‌కు చెందిన బీజేపీ లీగల్ సెల్‌ను అలర్ట్ చేసినట్టు సమాచారం. పక్కాగా వ్యూహాన్ని రూపొందించి, రిటర్నింగ్ అధికారికి అభ్యంతర పత్రాలు కూడా ప్రింట్ చేసుకున్నట్టు తెలిసింది. తమ వ్యూహం పక్కాగా అమలు కాబోతున్నదని నమ్మకం కుదిరాక బీజేపీ నేతలు మూడో అభ్యర్థిని రంగంలోకి దింపినట్టు తెలిసింది. తమకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని అనుసరించి ముందుగా ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపినట్టు సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ నేతల కోవర్టు రాజకీయంతో మీనాక్షి రాజకీయ బలి పశువు కావటం దాదాపు ఖాయమని నిర్ధారణ అయిన తర్వాత మూడో అభ్యర్థిని బరిలోకి దించినట్టు ఢిల్లీ కాంగ్రెస్ గుర్తించిందని తెలిసింది. మరోవైపు ముఖ్యనేతకు సన్నిహితంగా ఉన్న బీజేపీ నేత ఇటీవల తన కొడుకు విషయంలో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆయనకు ఆక్సిజన్ నింపి రాజకీయంగా బూస్టింగ్ ఇచ్చేందుకు ఆయన ద్వారానే కోర్టు సమన్ల వ్యవహారం నడిపారని ఢిల్లీ కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. మొత్తంగా ముఖ్యనేత తన ఆత్మీయుల కోసం మీనాక్షిని బలిచేశారని చెప్పుకొంటున్నారు.
లీకు వ్యవహారం యాదృచ్ఛికం కాదని, పక్కా ప్రణాళిక మేరకే జరిగినట్టు ఏఐసీసీ గుర్తించింది. కోర్టు సమన్ల ఒరిజినల్ పత్రాలనే మధ్యప్రదేశ్‌కు పంపడమే ఇందుకు సాక్ష్యంగా చెప్తున్నారు. పైగా ఈ పత్రాలు నేరుగా మధ్యప్రదేశ్‌కు కాకుండా ముందుగా మహారాష్ట్రకు పంపినట్టు తేలింది. ఇటీవల కొడుకు కేసుతో రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న ఒక కేంద్ర మంత్రికి ముందుగా మీనాక్షీ నటరాజన్ కోర్టు సమన్ల గురించి ఉప్పందించారట. ఆయన వెంటనే రాష్ట్ర బీజేపీ కీలక నేతతో కలిసి మహారాష్ట్రలోని ముఖ్యనేతకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం.
ఆ ముఖ్యనేత చురుకుగా స్పందించి జాతీయ నాయకత్వాన్ని అలర్ట్ చేయగా, వారు హాట్లైన్లో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఆ తర్వాత కోర్టు ఒరిజినల్ సమన్లు, కేసు వివరాలు, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో డీసీసీ మాజీ అధ్యక్షుడి మీద నమోదైన లైంగిక వేధింపులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను ముంబైకి తెప్పించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అప్పటికే మహారాష్ట్ర ముఖ్య నేత ఆ రాష్ట్ర బీజేపీ లీగల్ సెల్‌ను సిద్ధం చేశారని, అడ్వకేట్ల ద్వారా కేసును అధ్యయనం చేయించారని చెప్తున్నారు. లైంగిక వేధింపుల కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయవాదులు.. మీనాక్షి తన అఫిడవిట్లో కేసును ప్రస్తావించకపోతే తొలిదశలోనే ‘సెల్ఫ్ ఔట్’ చేయవచ్చని, ఒకవేళ అఫిడవిట్లో కేసు వివరాలు నమోదు చేస్తే ‘ప్లాన్ బీ’ అమలు చేయాలని సూచించినట్టు సమాచారం.