Telangana | నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 5(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్యేల ముందు సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల 2న నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో డీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి కోమటిరెడ్డి సోదరులు డుమ్మా కొట్టగా.. మిగతా ఎమ్మెల్యేలు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, డీసీసీ కార్యవర్గం మొత్తం హాజరైంది. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డికి కుడిభుజంగా చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. ‘ఆరు గ్యారెంటీలు ఇచ్చాం.. అవి ఎలా పోతున్నాయో తెల్వదు.
200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు రాలేదని, గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతలేవని ఇంకొందరు అంటున్నరు. ఏ కార్యకర్తను అడిగినా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగా ఆరు గ్యారెంటీలపై చెప్పలేకపోతున్నరు. నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు పెంచుతారు? వడ్లకు రూ.500 బోనస్ ఎప్పుడు ఇస్తామో? తెల్వదు. నెల రోజుల నుంచి రైతులు ధాన్యం రోడ్డు మీద పోసుకున్నరు. గతంలో వడ్లు కొంటే పది రోజుల్లోనే.. కాదు.. వారం రోజుల్లోనే డబ్బులు అకౌంట్లో పడేవి. ఇప్పడు చూస్తుంటే బాధ అనిపిస్తున్నది.
నల్లగొండ జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. మన మంత్రే ఉన్నడు… సివిల్ సప్లయ్ మంత్రిగా.. అయినా వడ్లు కొనకపోవడం బాధ అనిపిస్తున్నది. రైతులు అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నం’ అంటూ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య మాట్లాడుతూ పార్టీలో వివక్ష కొనసాగుతున్నదని, బీసీ, ఎస్టీ, ఎస్సీలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.