Indirmma Indlu | బోనకల్లు, ఏప్రిల్ 21 : ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదన్న ఆవేదనతో కాంగ్రెస్ నాయకుడైన మాజీ వైస్ ఎంపీపీ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వారించి ఆయన ప్రయత్నాన్ని అడ్డుకొని, పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. బోనకల్లు గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గుగులోత్ రమేశ్ ఏండ్లుగా కిరాయి ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఇండ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అనంతరం రమేశ్ పంచాయతీ కార్యాలయం వద్ద తన గోడు వెళ్లబోసుకున్నాడు. తాను కాంగ్రెస్ నాయకుడినని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడ్డానని చెప్పారు. అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తనకు ఇల్లు మంజూరు కాలేదని వాపోయాడు. ప్రభుత్వ సర్వేలో తన ఇల్లు ఉన్నట్టుగా అధికారులు నమోదు చేశారని, కానీ తనకు ఇల్లే లేదని తెలిపారు. తన సోదరుడు శ్రీను ఇంట్లోనే ఎన్నో ఏండ్లుగా అద్దెకు ఉంటున్నానని తెలిపాడు. తనకు ఇంటి స్థలం ఉన్నప్పటికీ, గిరిజనుడిని అయినా ప్రభుత్వం తనకు ఇల్లు మంజూరు చేయకపోవడానికి కారణమేమిటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశాడు.
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామంటూ చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అర్హుడినైన, కాంగ్రెస్ ప్రజాప్రతినిధిగా పనిచేసిన తనకే ఇల్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇల్లు మంజూరు చేయాలని సాక్షాత్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరానని, అయినా అయినా ఇండ్ల జాబితాలో తన పేరు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. తాను నమ్మిన తన కాంగ్రెస్ ప్రభుత్వమే తనను మోసం చేసిందని అన్నారు. అర్హుడినైన తనకే ఇందిరమ్మ మంజూరుకాకపోతే అసలైన పేదలకు ఇండ్ల రానేరావని స్పష్టం చేశారు.