గద్వాల/ఇటిక్యాల, నవంబర్ 2: అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకాలకు తెగబడుతున్నారు. ప్రజలకు సేవ చేసే అధికారులపైనా తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. తాజాగా.. స్థానిక కాంగ్రెస్ నాయకుడు మండలంలో మల్టిపుల్ వర్కర్‌ను మార్చాలంటూ తహసీల్దార్‌పై తీవ్రంగా ఒత్తిడి చేయడమే కాకుండా.. దుర్భాషలాడుతూ ఆయనపైకి బాటిల్ విసిరి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలలో చోటుచేసుకుంది. మండలంలోని మునుగాలలో మల్టిపుల్ వర్కర్‌ను మార్చాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రభాకర్‌రెడ్డి కొన్ని రోజులుగా గ్రామానికి ప్రత్యేకాధికారిగా ఉన్న తహసీల్దార్ నరేందర్‌పై ఒత్తిడి తెస్తున్నాడు.
ఇందుకు తహసీల్దార్ మల్టిపుల్ వర్కర్‌ను తొలగించాలనే విషయమై ఎంపీడీవో, ఎంపీవోలను సంప్రదించి శనివారం గ్రామ సభ ఏర్పాటు చేయాలని చాటింపు వేయించారు. ‘గ్రామసభ పెట్టకుండానే మల్టిపుల్ వర్కర్‌ను తొలగించాలి. గ్రామసభ పెట్టి గొడవలు సృష్టించాలనుకుంటున్నారా? మేం చెప్తే తీసేయాల్సిందే’ అంటూ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం విధుల్లో ఉన్న తహసీల్దార్‌ను దుర్భాషలాడుతూ ఆయనపైకి వాటర్ బాటిల్ విసిరికొట్టాడు. అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి గొడవ కాకుండా నిలువరించారు. ఈ విషయమై తహసీల్దార్ ఇటిక్యాల ఎస్సై వెంకటేశ్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఫిర్యాదు చేస్తే.. శనివారం సాయంత్రమైనా ఎస్సై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. తహసీల్దార్‌పై జరిగిన దాడి ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో తహసీల్దార్ మనోవేదనకు గురయ్యారు. ఒక అధికారిపై నాయకుడు ఇష్టానుసారంగా దుర్భాషలాడి దాడి చేస్తే పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోతే ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ఆవేదన వ్యక్తంచేశారు. అలంపూర్ నియోజవర్గంలోని రెవెన్యూ సిబ్బంది, అధికారులతో కలిసి తహసీల్దార్ నరేందర్.. తనపై కాంగ్రెస్ నేత చేసిన దాడి విషయాన్ని జోగుళాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన కలెక్టర్.. అధికారులపై దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఎస్పీని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇటిక్యాల ఎస్సైని వివరణ కోరగా.. విధులను అడ్డుకోవడం, దుర్భాషలాడటం, అధికారిపై దాడి చేసినందుకుగానూ ప్రభాకర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ఇబ్రహీం, శేషన్న, సాకలి మద్దిలేటి, బోయ వెంకటన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని తెలిపారు.