Congress Leader | మహబూబ్‌నగర్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అతను ఓ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్.. స్థానిక ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడు.. గ్రామాల్లో సీసీ రోడ్లకు ఇసుక తరలించేందుకు అనుమతి తీసుకొని అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో అడ్డుకున్న ఓ రెవెన్యూ ఉద్యోగిపై ఫోన్లో బెదిరింపులకు దిగాడు. నిన్ను, ఆర్ఐని, ఎమ్మార్వోని కలిపి తంతా.. అంటూ మాట్లాడిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం నిజాలాపూర్ వాగు నుంచి కొన్ని రోజులుగా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు కావడంతో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. నిజాలాపూర్లోని వాగు నుంచి అనుమతికిమించి ఇసుక తరలింపుపై అభ్యంతరం తెలిపిన రెవెన్యూ సిబ్బందిపై బూతులతో విరుచుకుపడ్డాడు. ‘ఎవడ్రా నువ్వు.. నిన్ను, ఆర్ఐను, తాసీల్దార్‌ను ఆఫీసుకు వచ్చి తంతా’.. అంటూ బెదిరింపులకు దిగాడు. ఎమ్మెల్యే ఆదేశానుసారం సీసీ రోడ్లకు ఇసుక సరఫరాకు తాసీల్దార్ అనుమతినిచ్చారు. అయితే వాగు నుంచి ఎన్ని ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారు? రికార్డు నమోదు చేయాలని తాసీల్దార్ రికార్డు అసిస్టెంట్ చెన్న రాయుడును నియమించారు. అనుమతికి మించి ఇసుక తరలిస్తుండడంతో ఇదేమిటని అడ్డుకున్నారు. అక్కడున్న ట్రాక్టర్ డ్రైవర్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడికి సమాచారం ఇచ్చారు. దీంతో చెన్నరాయుడుకి ఫోన్ చేసి ‘నిన్ను ఎవడు పంపాడు రా.. ఇక్కడి నుంచి వెళ్లిపో.. లేదా మూసుకొని కూర్చో.. మాట్లాడితే తాసీల్దార్, ఆర్ఐ పేర్లు చెబుతావు.. రా.. రా.. ఆఫీస్‌కు అంటూ బెదిరించాడు. దీంతో తాసీల్దార్ ఆఫీస్‌కి వచ్చి ఘటనను అధికారులకు చెప్పాడు. అధికారులు మాత్రం ఇది ఎక్కడా చెప్పవద్దని.. ఆదేశించినట్టు సమాచారం.