హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తీసేసి తీరని ద్రోహం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్నాయక్ ఆరోపించారు. లంబాడీలను ఎస్టీ క్యాటగిరీ నుంచి తొలగించాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలను ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. వారి వ్యాఖ్యల వెనుక సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క హస్తం ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. లేదంటే
వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే గిరిజన జాతుల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. లంబాడీల మనోభావాలను దెబ్బతీసే యత్నాలను విరమించుకోవాలని సూచించారు. ఎన్నో ఏండ్లుగా ఎస్టీ క్యాటగిరీలో ఉన్న లంబాడీలను బీసీలో చేర్చాలని చూడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఒకవైపు దేశంలోని బంజారా జాతులు లంబాడీ భాషకు సముచిత గుర్తింపుకోసం పోరాడుతున్న వేళ కాంగ్రెస్ నాయకులు విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.