గర్మిళ్ల, డిసెంబర్ 1: మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అనుచరులు గూండాయిజానికి తెరలేపారు. బీఆర్ఎస్కు చెందిన 15వ వార్డు కౌన్సిలర్ శ్రీరాముల సుజాత-మల్లేశ్ ఇంటికెళ్లి వారిద్దరిపై దాడి చేసి అరాచకం సృష్టించారు. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు తనకు ఫోన్ చేశారని, తమ నాయకుడికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎందుకు పోస్టులు పెడుతున్నావంటూ దుర్భాషలాడారని కౌన్సిలర్ సుజాత భర్త మల్లేశ్ తెలిపారు. అంతేకాదు.. తన ఇంటికి వచ్చి భార్య సుజాతతోపాటు ఇంట్లో ఉన్న మహిళలపై కూడా దాడి చేశారని చెప్పారు. తన చేతికి గాయమైందని, తనను చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ ముస్కె రాజు సిబ్బంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా.. బీఆర్ఎస్ కౌన్సిలర్ సుజాత ఇంటిపై పీఎస్సార్ అనుచరులు దాడి చేసిన విషయం తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కౌన్సిలర్ ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి స్థానిక ఓవర్ బ్రిడ్జిపైకి వచ్చి దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకోకు దిగారు. పీఎస్సార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేసే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్లు సుదమల్ల హరిక్రిష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే కుమారుడు నడిపెల్లి విజిత్‌రావు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.