Minister Ponguleti | హైదరాబాద్, నవంబర్ 1 ( నమస్తే తెలంగాణ) : దీపావళి ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం,అసహనం వ్యక్తం చేసిందా? ఈమేరకు గురువారం రాత్రి వయనాడ్ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు ఆగమేఘాల మీద వచ్చిన ఢిల్లీ దూత పొంగులేటిని పిలిపించి ముఖ్యనేత సమక్షంలోనే తలంటారా? అంటే ‘అవును’ అని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది.
‘అధికారం చేతిలో ఉంటే ఇంటి ఫంక్షన్ల మీద పోలీసులతో దాడులు చేయిస్తారా? రేప్పొద్దున ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? ఈ మాత్రం పనికి పొలిటికల్ బాంబులు పేలుతాయని ప్రకటనలు చేస్తారా? ఏవీ పొలిటికల్ బాంబులు?’ అంటూ నిలదీసినట్టు తెలిసింది. ఇలాంటి బాధ్యతా రాహిత్యమైన ప్రకటనలతో ప్రజల్లో చులకనైపోతామని, ఈ ప్రభావం ఎన్నికలు జరిగే రాష్ర్టాలపై పడి పార్టీ ఆగమయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం.
కేటీఆర్‌ను, బీఆర్ఎస్ నేతలను ఇబ్బం ది పెట్టే ప్రయత్నంలో భాగంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పొలిటికల్ బాంబులనే కుట్రకు తెరలేపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మూసీ నదికి, దక్షిణ కొరియాలోని సియోల్ పట్టణంలో ఉన్న చుంగ్ గై చున్ వాగుకు ముడిపెడుతూ అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వం కొందరు మంత్రులు, అధికారులు, జర్నలిస్టులను అక్కడికి పంపిన సంగతి తెలిసిందే. మూసీ నదికి, చుంగ్ గై చున్ కాల్వకు అసలు పొంతనే లేదని కొందరు జర్నలిస్టులు తేల్చిచెప్పిన నేపథ్యంలో.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా పొంగులేటి పొలిటికల్ బాంబులు అంటూ కథలు చెప్పడంతో ఆయన వాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి.
ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఏం జరుగబోతుందోనని ప్రజలు కూడా ఆసక్తిగా గమనించారు. ఏం జరుగుతుందో తెలియక ఇటు పాలక పక్షం నేతలు కూడా గందరగోళంలో పడ్డారు. ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఖమ్మం, నల్లగొండ జిల్లాల కీలక నాయకులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలసింది. కేవలం తన వ్యక్తిగత మైలేజీని పెంచుకునేందుకు, ప్రభుత్వంలో నంబర్ 2 అనే ఇమేజ్ను సంపాధించుకోవాలనే అత్యుత్సాహంతోనే బాధ్యత లేని వ్యాఖ్యలు చేశారని వారు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలసింది. ఈ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి మేలూ జరగక పోగా.. ప్రభుత్వమే ఇరుకున పడే పరిస్థితి వచ్చిందని, ఆయనను కంట్రోల్ చేయకపోతే పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టమని వారు ఫిర్యాదులో పేర్కొనట్టు సమాచారం.
నేతల ఫిర్యాదును సీరియస్ తీసున్న కాంగ్రెస్ అధిష్ఠానం సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జిని పంపినట్టు తెలిసింది. కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల బిజీలో ఉన్న ఆయన అధిష్ఠానం ఆదేశాలతో అత్యవసరంగా తన షెడ్యూల్‌ను మార్చుకొని దీపావళి పండగరోజు (గురువారం) రాత్రి హైదరాబాద్ వచ్చినట్టు తెలిసింది. రాత్రి ఇక్కడే బసచేసి ముఖ్యనేతతో పాటు పొంగులేటిని కూడా పిలిపించి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
ఏ సందర్భంలో ఇలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందో చెప్పాలని అడిగినట్టు తెలిసింది. పొంగులేటి ఇచ్చిన వివరణ మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ‘అరెస్టులు, ఎంక్వైరీల మీద మాట్లాడటానికి మీరు హోం మంత్రి కాదు కదా?’ అని గట్టిగానే నిలదీసినట్టు విశ్వసనీయ సమాచారం. పరిపాలన అంటే పరాచికాలు కాదని, పాలన మీద దృష్టి పెట్టాలని కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. ఢిల్లీ దూత చిందులు చూసి ముఖ్యనేతతో పాటు పొంగులేటి నీళ్లు నమిలినట్టు సమాచారం.