వరంగల్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఇతర ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు, విమర్శలు, ఆరోపణలతో గ్రూపుల పంచాయితీ రోజుకొక కొత్త మలుపు తిరుగుతున్నది. అధిష్ఠానం, పీసీసీ స్థాయిలో జోక్యం చేసుకొని హెచ్చరికలు చేసినా, నోటీసులిచ్చినా వరంగల్ ఉమ్మడి జిల్లాలో గ్రూపు విభేదాలు ఆగడంలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలపై మంత్రి కొండా సురేఖ భర్త మురళి శనివారం చేసిన విమర్శలతో ప్రత్యర్థి వర్గం తీవ్రంగా స్పందిస్తున్నది. మురళి విమర్శలను తిప్పికొట్టడం, తమ ఫిర్యాదులపై టీపీసీసీ త్వరగా నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్‌తో మంత్రి కొండా సురేఖ వ్యతిరేక గ్రూపు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధికారిక నివాసంలో పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొండా సురేఖ భర్త మురళి చేసిన విమర్శలను తీవ్రంగా పరిగణించాలని, ఈ విషయమై టీపీసీసీ త్వరగా నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. జూలై 5లోగా మురళిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు పీసీసీ అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చారు. 5లోగా నిర్ణయం తీసుకోవాలి: సారయ్య
కొండా మురళి తప్పుడు ప్రచారం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన బస్వరాజు సారయ్య అన్నారు. కొండా దంపతులకు దమ్ముంటే సొంత పార్టీ పెట్టుకోవాలని సవాలు విసిరారు. మురళిపై చర్యల విషయంలో వచ్చే నెల 5లోగా నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీని హెచ్చరించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ కొండా మురళి సొంత పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురిచేశారని, వారిని కొట్టించారని ఆరోపించారు. మురళి వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని చక్కదిద్దుకోవాలి గానీ ఇతర నియోజకవర్గాలను కాదని హితవు పలికారు.