Congress | హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మూడు స్కీములు.. ఆరు స్కాములు అన్నట్టుగా సాగుతున్నది. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ పేరుతో రూ.3.5కోట్లు చేతులు మారాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడం, రూ.68 లక్షలు పట్టుబడటం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ముఠా సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారు. కుంభకోణం ఓ మంత్రి, ఓ ముఖ్యనేత బంధువు పాత్ర ఉందని విచారణలో తెలిసింది. కాంట్రాక్ట్ లెక్చరర్ల స్కాం ప్రకంపనలు సృష్టిస్తున్నది. బయటపడ్డది కొంత మాత్రమేనని, భారీ స్కామ్ జరిగి ఉంటుందని లెక్చరర్లు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ పేరుతో లెక్చరర్ల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు కాసుల దందాకు తెరలేపారు. రెగ్యులరైజ్ చేయిస్తామంటూ ఓ ముఠా 30 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసింది. ఇటీవలే ప్రభుత్వం 23 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసిం ది. విద్యాశాఖ బుధవారం జీవో 35 వెలువరించింది. క్రమబద్ధీకరించిన వారిలో తెలుగు, హిందీ, ఎకనామిక్స్, సివిక్స్, గణితం, కెమిస్ట్రీ, కామర్స్, బోటనీ లెక్చరర్లు ఉన్నారు. అయితే ముఠాకు డబ్బులిచ్చిన వారిలో కొందరు లెక్చరర్లకు రెగ్యులరైజ్ కాలేదు. దీంతో వారంతా ముఠాను నిలదీశారు. డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో .. ఆ ముఠా తప్పించుకుని తిరుగుతున్నది. విసిగి వేసారిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ముఠాను అరెస్టుచేసి, రూ.68లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రెగ్యులరైజ్ పేరుతో రూ.3.5 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తున్నది.
ఏడాది క్రితం 5వేల మందికి పైగా లెక్చరర్లు, ఉద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఇంటర్ విద్యలో ఉర్దూ లెక్చరర్లు 13 మంది, మరో 411 మంది ఒకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్లు క్రమబద్ధీకరణకు నోచుకోలేదు. అభ్యర్థుల విద్యార్హతలు, పోస్టులు మంజూరు కాకుండానే కాంట్రాక్ట్ లెక్చరర్లను నియమించడం వంటి కారణాలతో వీరి రెగ్యులరైజేషన్ను అధికారులు పక్కనపెట్టారు. వీరంతా రెగ్యులరైజ్ అయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో వోకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్లు రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు. జీవో 12కు సంబంధించిన వారు 175 మంది ఒక గ్రూపుగా, జీవో 12తో సంబంధంలేని 236 మంది మరో గ్రూపుగా విడిపోయారు. ఒక ముఠా ఒక్కో లెక్చరర్ క్రమబద్ధీకరణకు రూ.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ రూ.10 లక్షలను నాలుగు దశల్లో ఇవ్వాలని షరతు విధించుకున్నారు. డబ్బులిచ్చిన విషయం బయటికి చెప్పవద్దంటూ పిల్లల మీద ప్రమాణం చేయించుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
కాంట్రాక్ట్ ఉద్యోగులను పారదర్శకంగా క్రమబద్ధీకరించిన ఘనత కేసీఆర్ సర్కారు సొంతం. ఒకే ఒక్క సంతకంతో ఎలాంటి ఆరోపణలు లేకుండా కేసీఆర్ సర్కారు 5,544 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. ఇందులో 3,897 మంది ఉద్యోగులు విద్యాశాఖకు చెందిన వారే ఉన్నారు. వీరిలో అత్యధికంగా 2,909 జూనియర్ లెక్చరర్లుండగా, 184 జూనియర్ లెక్చరర్లు (ఒకేషనల్) ఉన్నారు. మరో 390 పాలిటెక్నిక్, 270 డిగ్రీ లెక్చకర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 అటెండర్లు, వైద్యారోగ్యశాఖలో 837 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, కార్మిక ఉపాధి కల్పనశాఖలో 230 మంది సహాయ శిక్షణ అధికారులున్నారు. రెగ్యులరైజేషన్ సమయంలో ఇంటర్ విద్యలో 424 మంది రెగ్యులరైజ్ కాలేదు. ఇదే అదనుగా ప్రస్తుతం పెద్దల అండతో కొన్ని ముఠాలు వసూళ్ల దందాకు తెరలేపాయి.
కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి కాసులు వసూలు చేసిన ముఠా వెనుక కొందరు పెద్దల హస్తం ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఓ మంత్రి, ముఖ్యనేత బంధువు చక్రం తిప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. పోలీసులు పట్టుకున్న వారు విచారణలో వారి పేర్లు వెల్లడించినట్టు సమాచారం. సచివాలయంలో పనిచేసే కొంత మంది పాత్ర కూడా ఉందన్న అనుమానాలున్నాయి. ఈ ముఠానే కాకుండా మరికొన్ని లాబీ ముఠాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఒకేషనల్ లెక్చరర్ల నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు చేసిన ఓ నిందితుడు ఆ తర్వాత చేతులెత్తేసినట్టు తెలుస్తున్నది. వసూలు చేసిన సొమ్ముతో విల్లా కొనుక్కుకున్నానని, ఇప్పుడు తానేం చేయలేనంటూ తప్పించుకుని తిరుగుతున్నాడని సమాచారం.