హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): వ్యక్తిగత ప్రతిష్ట కోసం వెంపర్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) గ్లోబల్ సమ్మిట్‌తో (Global Summit) అభాసుపాలయ్యారా? ఫ్యూచర్ సిటీలో రియ ల్ ఎస్టేట్‌ను ప్రమోట్ చేయడంలో భాగంగా అగ్గవకు భూములు కట్టబెట్టేందుకు హడావిడిగా ఈ సమ్మిట్‌కు ఏర్పాట్లు చేశారా? అంటే అవుననే అంటున్నారు కొందరు డెలిగేట్స్. ఫోర్త్‌సిటీ ప్రచార యావలో పడి అతిథులకు మర్యాదలు చేయడంలో ఆయన తీవ్రంగా విఫలమయ్యారన్న మాటలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి మౌలిక వసతులు కల్పించకపోవడం బాధాకరమని, కనీసం వాష్ రూములను కూడా సరిగా ఏర్పాటు చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని పలువురు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమ్మిట్‌కు వచ్చిన వీవీఐపీలు ఎవరో, వీఐపీలు ఎవరో, విద్యార్థులెవరో తెలియక పాస్‌లు జారీచేసే విషయంలోనూ తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఒకానొక దశలో ఎవరికి డెలిగేట్ పాస్‌లు ఇస్తున్నారో తెలియకపోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్నది. పాస్‌ల జారీకి ప్రత్యేకంగా నాలుగు సెక్షన్లు ఏర్పాటు చేయడం, ఏకంగా సమ్మిట్ ముఖద్వారం వద్దే పాస్‌ల సెక్షన్‌ను పెట్టడం, ఉన్నతాధికారులు చెప్పిన వారికి అప్పటికప్పుడే పాస్‌లు, ఐడీ కార్డులు, ట్యాగ్లు ఇచ్చి లోపలికి పంపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వంటలు అట్టర్ ఫ్లాప్
గ్లోబల్ సమ్మిట్‌లో ఎవరెవరికి ఎక్కడ భోజనాలు ఏర్పాటు చేశారో తెలియక చాలామంది గుడారాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అతిథులకు సుపరిచితమైన తెలంగాణ వంటకాలను వడ్డిస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు మీడియా ముందు ఊదరగొట్టినప్పటికీ భోజనాల్లో ఎక్కడా తెలంగాణ వంటకాలు దర్శనమివ్వలేదు. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీలను డెలిగేట్స్ తినలేకపోయారు. బిర్యానీ పలుకుపలుకుగా బియ్యం నమిలినట్టే ఉండటం, అందులో నూనె అధికంగా ఉండటమే ఇందుకు కారణం. తెల్లన్నం కూడా అలాగే ఉడికీ ఉడకనట్టు ఉండటం, మటన్, వెజ్ కర్రీస్ రుచికరంగా లేకపోవడంతో తినలేక సగం భోజనాన్ని ప్లేట్లలోనే వదిలేశారు. ఆకలి తీర్చుకునేందుకు ఐస్ క్రీమ్, స్వీట్ల వైపు మొగ్గు చూపారు.
అపరిశుభ్రంగా వాష్‌రూమ్స్, టాయిలెట్స్
గ్లోబల్ సమ్మిట్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వాష్‌రూమ్స్, టాయిలెట్స్ సరిగా లేకపోవడంతో అతిథులు ఆవేదన వ్యక్తంచేశారు. నిర్వహణ సరిగా లేక మిడ్వాల్స్ ఊడి పడిపోయాయి. సరిచేయాల్సినవారు సకాలంలో రాకపోవడంతో టాయిలెట్స్‌కు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ టాయిలెట్స్ సైతం అపరిశుభ్రంగా ఉండటం, వాటిని క్లీన్ చేసేవారులేక దుర్గంధం వెదజల్లడంతో చేసేదేమీ లేక డెలిగేట్స్ ముక్కుమూసుకొనే పని కానిచ్చేశారు. ఫుల్ అయిన వాష్‌రూమ్స్‌ను వెంటనే శుభ్రం చేయకపోవడంతో నీరు బయటికి వచ్చి మురుగు వాసన కొట్టింది.
ఎటుచూసినా అతుకుల బొతుకులే
ప్రజాపాలన వారోత్సవాలకు ముందే గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించాలన్న తొందరపాటుతో ఎక్కడి పనులు అక్కడే వదిలేసినట్టు కనిపించింది. సమ్మిట్ ప్రాంగణంలో ఎటుచూసినా అతుకుల బొతుకులే దర్శనమిచ్చాయి. గ్రాస్ షీట్లు నేలకు సరిగ్గా అతుక్కోకపోవడంతో నిండుదనం లేదు. హడావుడిగా వేసిన వాకింగ్ టెయిల్స్‌పై కొద్ది మంది నడవగానే పగుళ్లు వచ్చాయి. నీళ్లు పోసేవారు లేక పూలకుండీల్లోని మొక్కలు వాడిపోయాయి. టెంట్లు, డేరాలు కనిపించకుండా షామియానా క్లాత్‌లతో డెకరేట్ చేయడంతో పలువురు డెలిగేట్స్ వాటివైపే దృష్టి కేంద్రీకరించారు. అనుకోకుండా ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే తమ గతేమిటని చర్చించుకున్నారు. మొత్తంగా అరకొర ఏర్పాట్లతో గ్లోబల్ సమ్మిట్ కాస్తా ‘లోకల్ సమ్మిట్’గా మారిపోయింది.