హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ సర్కారు కొందర్ని టార్గెట్ చేసిందా? కొరకరాని కొయ్యలా ఉన్న రాజకీయ నేతల్ని, అధికారులను లక్ష్యంగా చేసుకున్నదా? అందుకే క్షక్షపూరితంగా కొందరి పేర్లను నివేదికలో పేర్కొన్న కమిషన్ మిగిలిన అధికారుల పేర్లను వదిలేసిందా? వాళ్లను బద్నాం చేయాలని భావిస్తున్నదా? ఓ శాఖ మంత్రులు బాధ్యులైనప్పుడు.. అదే శాఖకు చెందిన ఉన్నతాధికారులు బాధ్యులు కారా? సీఎం బాధ్యులైనప్పుడు సీఎస్ బాధ్యులు కారా? సీఎం బాధ్యులైనప్పుడు మంత్రి మండలి బాధ్యత వహించదా? ఈ ప్రశ్నలకు ఇరిగేషన్, న్యాయ నిపుణుల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అధికారుల పాత్ర మీద కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై సర్కారు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సర్కారు విడుదల చేసిన కాళేశ్వరం కమిషన్ సంక్షిప్త నివేదికలో ప్రత్యేకంగా కొందరు అధికారుల పేర్లు ప్రస్తావిస్తూ మరికొందరు అధికారుల పేర్లు ప్రస్తావించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమయంలో ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా ఉన్న ఎస్కే జోషి పేరును నివేదికలో పేర్కొంది. ఆర్థిక క్రమశిక్షణ తప్పిందని పేర్కొన్న కమిషన్.. ఆ సమయంలో ఉన్న ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, లేదా ప్రత్యేక ప్రధానకార్యదర్శి పేర్లను ఎందుకు ప్రస్తావించలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అదేవిధంగా నాటి సీఎం కేసీఆర్ పేరును సైతం కమిషన్ తన నివేదికలో పొందుపరిచింది. ఈ నేపథ్యంలో సీఎం బాధ్యుడైనప్పుడు సీఎస్ బాధ్యుడు కాదా అన్న సందేహం వ్యక్తమవుతున్నది. అదేవిధంగా ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేరును ప్రస్తావించిన కమిషన్ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేరును ఎందుకు పేర్కొనలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. సర్కారు విడుదల చేసిన నివేదికలో ఆర్థిక, ఇరిగేషన్ శాఖకు సంబంధించి సెక్రటరీ స్థాయి అధికారులను బలిచేసే కుట్రలు జరిగాయనే ఆరోపణలున్నాయి. పలు స్థాయిల్లోని ఐఏఎస్ అధికారులను బాధ్యులుగా పేర్కొన్న కమిషన్ ఇందులో నాటి సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, ఇరిగేషన్‌శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి పేర్లను మాత్రమే ప్రస్తావించి.. మిగతా వాళ్ల పేర్లను గల్లంతు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం కాళేశ్వరంలో కేవలం ఇద్దరు ఐఏఎస్ అధికారులు మాత్రమే బాధ్యులా అని ప్రశ్నిస్తున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పరిధితో సంబంధంలేని వారిని కూడా బాధ్యుల్ని చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇంజినీర్లలోనూ పలువురి పేర్లను ప్రస్తావించి.. మిగిలిన పేర్లను దాచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కావాలనే కొందర్ని టార్గెట్‌గా చేసుకొని వారి పేర్లను నివేదికలో పేర్కొన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.