హైదరాబాద్, మే8 (నమస్తే తెలంగాణ): 50 ఏండ్లు పైబడిన పురుష ఉపాధ్యాయులను బాలికల గురుకులాల్లో కొనసాగించాలని, వారిని జీవో 1274 నుంచి మినహాయించాలని ఆల్ తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎట్గ్రీవ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్, గురుకుల సెక్రటరీ వర్షిణిని గురువారం కలిసిన సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎట్గ్రీవ రాష్ట్ర అధ్యక్షుడు కూకట్ల యాదయ్య మాట్లాడుతూ.. 2016లోనే జీవో 1274 వచ్చిందని, అదీ రిక్రూట్మెంట్కు సంబంధించినది మాత్రమేనని వెల్లడించారు. అదీగాక 2018, 2019లోనూ, నిరుడు నిర్వహించిన బదిలీలు, ప్రమోషన్లలో కూడా ఎక్కడా జీవోను అమలు చేయలేదని గుర్తుచేశారు. బదిలీల క్రమంలో బాలుర గురుకులాలను ఎంచుకునే అవకాశాన్ని బాలికల గురుకులాల్లో పనిచేసే పురుష సిబ్బందికి కల్పించాలని అన్నారు. లేదంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి, కోశాధికారి బసవయ్య తదితరులు పాల్గొన్నారు.