హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రిమండలి ఒక నిర్ణయం తీసుకున్నదంటే కచ్చితంగా అమలవుతుందని ప్రజలు నమ్ముతుంటారు. అయితే రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని అమలు కావటం లేదు. సమావేశం తర్వాత ఫలానా నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ఘనంగా చెప్పకుంటున్నా.. అమల్లో మాత్రం మందగమనం కనిపిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించి, వేగంగా పూర్తిచేసే వ్యవస్థ లేకపోవటమే ఇందుకు కారణమని అంటున్నారు. కీలక నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం వేసి కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మార్చి 12న జరిగిన క్యాబినెట్ సమావేశంలో.. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. గ్రామ సభలు పెట్టి దరఖాస్తులపై చర్చించి, జాబితా రూపొందిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్క ఇల్లుకు కూడా నిధులు విడుదల కాలేదు. మహిళా సంఘాల బ్రాండింగ్ కోసం ఓఆర్ఆర్ చుట్టూ 30 ఎకరాల స్థలం కేటాయించాలని నిర్ణయించినా ఇప్పటివరకు అమలు కాలేదు. డీఎస్సీ 2008 బాధితులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. విధివిధానాల ఖరారును సబ్ కమిటీకి అప్పగించారు. అయితే ఇప్పటివరకు పూర్తి కాలేదు.
జూన్ 21న జరిగిన క్యాబినెట్ సమావేశంలో అందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. కానీ.. ఇప్పటికీ పూర్తికాలేదు. రూ.18 వేల కోట్లతో రుణమాఫీ చేశామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అంటే ఇంకా రూ.13 వేల కోట్ల రుణమాఫీ కాలేదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ జూలై 15లోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని, అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ జరుపుతామని చెప్పారు. కానీ.. నివేదిక అందలేదు. అసెంబ్లీలో చర్చించలేదు.
ఆగస్టు 1న జరిగిన క్యాబినెట్ సమావేశంలో.. కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించిన విదివిధానాల రూపకల్పన బాధ్యతలను సబ్ కమిటీకి అప్పగించారు. రేషన్‌కార్డులకు కొత్తగా అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సీఎం గురువారం ఆదేశించగా, ఆరోగ్యశ్రీ కార్డులపై స్పష్టత రాలేదు. క్రీడాకారులు నిఖత్ జరీన్, సిరాజ్‌కు గ్రూప్-1 ఉద్యోగాలు ఇస్తామని నిర్ణయించగా, సిరాజ్‌కు ఇప్పటివరకు ఉద్యోగం ఇవ్వలేదు.
విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్త్రన్ కుమారుడు హరిరతన్‌కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినా అమల్లోకి రాలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు చేపడుతామని చెప్పినా ఆచరణలోకి రాలేదు. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని, ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా అమలు చేస్తామని మీడియా ముందు చెప్పారు. కానీ ఇప్పటికీ ఆర్డినెన్స్ తేలేదు.