జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ సీతారామ ప్రాజెక్టునూ పక్కన పెట్టేసింది. ఇరవై నెలలైనా పైసా పని చేయలేదు. పంప్‌హౌస్ వరకు విద్యుత్తు లైన్ వేసి చేతులు దులుపుకొన్నది. విద్యుత్తు కనెక్షన్ ఇస్తే సుమారు 2వేల ఎకరాలు సాగులోకి వచ్చేది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు 20 నెలల కాలంలో నాలుగో పంటనూ నష్టపోయారు. కేవలం 5 కిలోమీటర్ల ప్రాజెక్టు పైపులైన్ పనులు పూర్తి చేస్తే 5 వేల ఎకరాలు సాగులోకి వచ్చేది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం సమీపంలో భీంగణపూర్ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మెట్ట భూములను సాగులోకి తేవాలనే లక్ష్యంతో రూ.64 కోట్లతో కేసీఆర్ సర్కారు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పంప్‌హౌస్, సబ్‌స్టేషన్, 14 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ నిర్మాణం చేపట్టి గండికామారం, గొల్లబుద్ధారం, దూదేకులపల్లి, దీక్షకుంట గ్రామాల రైతులకు సాగునీరు అందించాల్సి ఉంది.
కాగా, పంప్‌హౌస్, సబ్‌స్టేషన్ నిర్మాణంతోపాటు 9 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ నిర్మాణ పనులు పూర్తిచేశారు. పంప్‌హౌస్ సమీపంలో నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి, నీటిని ఎత్తిపోసేందుకు 240 హెచ్‌పీ మోటర్లు నాలుగు, 170 హెచ్‌పీ మోటర్లు మూడింటిని ఏర్పాటు చేశారు. మరో 5 కిలోమీటర్ల పొడవు పైపులైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. అక్కడ అటవీ భూములు ఉండటంతో అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో పనుల్లో జాప్యం జరిగింది. చివరికి అప్పటి కలెక్టర్ భవేశ్‌మిశ్రా అటవీశాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అప్పటికే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో సీతారామ ప్రాజెక్టును పట్టించుకునేవారు కరువయ్యారు.
6 కోట్లు వెచ్చిస్తే చాలు
సీతారామ ప్రాజెక్టులో పెండింగ్‌లో ఉన్న 5 కిలోమీటర్ల పైపులైన్ పనులు పూర్తి చేసి విద్యుత్తు సౌకర్యం కల్పిస్తే 5 వేల ఎకరాలు సాగులోకి వస్తుంది. భీంగణపూర్ చెరువును దేవాదుల రిజర్వాయర్‌గా మార్చడంతో నీరు పుష్కలంగా ఉన్నది. ఏటూరునాగారం ఇన్‌టెక్‌వెల్ నుంచి గోదావరి జలాలు దేవాదుల పైపులైన్ ద్వారా భీంగణపూర్ రిజర్వాయర్‌కు చేరుతున్నాయి. ఇక్కడి నుంచి మూడు ఫేజ్‌ల ద్వారా రామప్ప, పులుకుర్తి, చలివాగు రిజర్వాయర్లకు చేరుతాయి. కాగా భీంగణపూర్ రిజర్వాయర్ వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే మెట్ట భూములకు సాగునీరు అందుతుందని భావించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ సీతారామ ప్రాజెక్టు నిర్మించింది. రూ. 6 కోట్లు వెచ్చించి పైపులైన్, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తే రైతులకు ఇప్పటికీ నాలుగు పంటలు పండేవి.
కనీసం విద్యుత్తు సౌకర్యం కల్పించినా 9 కిలోమీటర్ల మేర ఉన్న పైపులైన్ ద్వారా సుమారు 2 వేల ఎకరాలు సాగులోకి వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయమై నోరు మెదపకపోవడం రైతులకు శాపంగా మారింది. గత వేసవిలోనే అధికారులు పనులు ప్రారంభించి రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పినా పనుల్లో కదలిక లేదు. వేసవిలో పనులు పూర్తి చేయిస్తే ఈ కరువు పరిస్థితుల్లో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. చెరువులు, కుంటలు నీటితో కళకళలాడేవి. ప్రస్తుతం వానకాలం కావడం, రైతులు పంటల సాగు ప్రారంభించడంతో మళ్లీ ఏడాది వరకు పనులు ప్రారంభించే అవకాశం లేదు. వేసవికి ముందే నమస్తే తెలంగాణలో ‘మూడో పంటకూ మోక్షం లేదు’ అనే కథనం ప్రచురితం కాగా అధికారులు కేవలం విద్యుత్తు లైన్ అందించారు. పైపులైన్ నిర్మాణం మరిచారు.
కాంట్రాక్టు రద్దు చేశాం
పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్‌ను రద్దు చేశాం. మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తాం. గత వేసవిలోనే పనులు మొదలు పెట్టేవాళ్లం. కాంట్రాక్టర్ పని చేయకపోతే నోటీసులు ఇచ్చి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాం. కొత్త
ఏజెన్సీకి నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చి వచ్చే ఏప్రిల్, మే నెలల్లో పనులు ప్రారంభిస్తాం.
– రాజయ్య, డీఈ