Congress | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ):
– ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని స్వయంగా ఒక మంత్రి నిర్ధారించారు.
– కమిషన్ ఇస్తే తప్ప అనుమతులు రావడంలేదని రియల్టర్లు, కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు.
– కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం తప్పు అని స్వయంగా రేవంత్‌రెడ్డి మామ ఖండించారు.
– ఇటీవల న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
– తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును కూడా ఉండటం.
ఇలా వరుస పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కొత్త నాటకాన్ని తెరమీదకి తెచ్చింది. ఏడాదిన్నరగా అమలు చేస్తున్న డైవర్షన్ స్కీం లో భాగంగా.. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ పేరుతో లీకుల డ్రామా మొదలుపెట్టింది. ఒక నకిలీ లేఖను సృష్టించి తన అనుకూల మీడియా ద్వారా విచ్చలవిడిగా ప్రచారం చేయిస్తున్నది. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నది. తద్వారా బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరగబోతున్నదంటూ హడావిడి చేసి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనపరంగా వైఫల్యాలు వెంటాడుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రధానంగా రెండు మూడు నెలలుగా కాంగ్రెస్ అసమర్థ విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగిందన్నారు. విలువైన భూములను చేజిక్కించుకొని అమ్ముకోవాలనే దురుద్దేశంతో.. కంచ గచ్చిబౌలి భూములను బలవంతంగా గుంజుకోవడం, పర్యావరణాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దాదాపు 100 ఎకరాల్లో ప్రభుత్వం సృష్టించిన విధ్వంసంపై సుప్రీంకోర్టు సైతం కన్నెర్ర చేసింది. అక్కడ అడవిని పునరుద్ధరించకపోతే అధికారులను జైళ్లకు పంపుతామని హెచ్చరించింది.
ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన ఉద్యమం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రాష్ర్టానికి చెందిన రియల్టర్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసి వినతిపత్రం ఇచ్చి వచ్చినట్టు వార్తలు వచ్చాయి. నిర్మాణ అనుమతులు కావాలంటే చదరపు అడుగుకు రూ.200-300 చొప్పున కమీషన్ ముట్ట చెప్పాల్సి వస్తున్నదని రియల్టర్లు ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరిగింది. ఇక ప్రభుత్వంలో కమీషన్ల బాగోతం ఓపెన్ సీక్రెట్‌గా మారిందనే విమర్శలు ఉన్నాయి.
మొదట్లో 8%తో ప్రారంభమైన కమీషన్లు, ఇప్పుడు 30 శాతానికి చేరాయని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారని కథనాలు వెలువడ్డాయి. ఇక ఇటీవల.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట. ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని స్వయంగా ఆమె నిర్ధారించడంతో అటు పార్టీ పెద్దలు ఇటు ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకున్నారు. దీనికితోడు పంట కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు నష్టపోవడం, రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకపోవడం, రైతు భరోసా ఊసే లేకపోవడం.. తదితర పరిణామాలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించాయి.
కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వంపై చేసిన ప్రధాన ఆరోపణ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి’. ఈ విషయంలోనూ రేవంత్‌రెడ్డికి తాజాగా ఎదురుదెబ్బలు తగిలాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్లలో అవినీతి జరిగినట్టు ఆధారాలు లేవని ఏకంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటి సమాధానమని విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇక కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి మామ సూదిని పద్మారెడ్డి ఖండించారు. ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు అవినీతి జరిగిందనడం తప్పు అని పేర్కొన్నారు. రూ.94 వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎలా అంటారని ప్రశ్నించారు. వాస్తవాలకు విరుద్ధంగా కలగాపులగం చేసి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ ఇన్నేళ్లుగా చేస్తున్నదంతా దుష్ప్రచారమని ప్రజలకు అర్థమవుతున్నది.
ఇటీవల అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయి. పలువురు మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా సీఎం తన ఇంట్లో చేస్తున్న సమీక్షల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. దూరంగా ఉంటున్నారని, దీంతో సీఎం దిగివచ్చారని చెప్తున్నారు. మరోవైపు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా విమర్శల వాన కురిపించారు.
ఆమె ఏకంగా గాంధీభవన్‌లో నిరసనకు దిగారు. దీనిపై ఏఐసీసీ ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. పాలనా వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, కమీషన్ల బాగోతం, మంత్రుల అసంతృప్తి, పార్టీలో కుమ్ములాటలు వెరసి ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ఠ పూర్తిగా దిగజారిపోతున్న పరిస్థితుల్లో అటెన్షన్ డైవర్షన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి తెరలేపినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత పేరిట ఓ నకిలీ లేఖను సృష్టించి లీకుల డ్రామా మొదలుపెట్టారని వ్యాఖ్యానిస్తున్నారు.