హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమ భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది. వ్యవసాయం, పరిశ్రమలను అనుసంధానం చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచాలనే లక్ష్యానికి కాంగ్రెస్ సర్కారు నిర్వాహకంతో తూట్లుపడ్డాయి. జిల్లాల వారీగా ఉత్పత్తి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడికక్కడే ప్రాసెసింగ్ చేయాలన్న సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 7 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని సిద్ధం చేసినా..ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు.
గడిచిన ఏడాదిన్నరలోగా ఈ రంగాలను ఆదుకోవడానికి సర్కార్ ఒక్క పైసా విడుదల చేయలేదు. తెలంగాణ ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ సర్కారు ప్రణాళికాబద్ధంగా ఒక్కో రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా నీటిపారుదల రంగం అభివృద్ధితో వ్యవసాయ దిగుబడులు భారీగా పెరిగాయి. దీంతో జిల్లాలవారీగా ఎక్కడ పండే వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడే ప్రాసెస్‌చేసి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేసింది.
భూసేకరణ ద్వారా రైతులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో జిల్లాలవారీగా 7,149 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించి టీజీఐఐసీకి అప్పగించింది. రైస్ మిల్లులు, పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, మిల్లెట్స్, పంచదార, వంటనూనెలు, పాల ఉత్పత్తులు, వివిధ రకాల పానియాలు ఉత్పత్తిచేసే పరిశ్రమలకు ఈ భూములను కేటాయించాలని నిర్ణయించారు.
కేసీఆర్ ప్రభుత్వ సంకల్పానికి మద్ధతుగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకువచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ సర్కార్ మొండిచెయ్యి చూపించింది. గతంలో టీజీఐఐసీ అభివృద్ధి చేసిన భూములను పరిశ్రమలకు కేటాయించాల్సి ఉండగా, నూతన ప్రభుత్వం రావడంతో వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఆహార శుద్ధి పరిశ్రమ కోసం గుర్తించిన భూములు అలాగే ఉండిపోయాయి. ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో టీజీఐఐసీ అధికారులు సైతం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు నిధులిస్తే తాము పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. భూములను అభివృద్ధిచేస్తే పరిశ్రమల ఏర్పాటుకు చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఆ దిశగా దృష్టి పెట్టడంలేదు.