హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర మహిళామోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ, మహిళలకు అండగా మంగళవారం ధర్నా చేపట్టనున్నట్టు వెల్లడించారు.
క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలి
హైదరాబాద్, జూలై7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. టీ 20 ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సతరించి అభినందిస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ను విస్మరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గానికి క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని నాయకులు రామకృష్ణ, హరీశ్, జగదీశ్, భగత్, వినయ్, ప్రవీణ్, అర్జున్ డిమాండ్ చేశారు.