రేవంత్ సర్కార్ బెదిరింపుల పర్వంలో తాజా ఉదంతమిది. బాధితుల చిట్టాలో మరో ప్రముఖ సంస్థ చేరింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్, ప్రభుత్వరంగ సంస్థ ఎస్బీఐ.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల నీడలకు, అరాచక జాడలకు లక్ష్యంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ తెలంగాణలో ఒక్కొక్క సంస్థ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు ఎలా బలైతున్నదో చూస్తూనే ఉన్నాం. మొదట పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినవారిని వెళ్లగొట్టారు. పరిశ్రమలను పక్కరాష్ర్టాలకు సాగనంపారు. సినిమా పరిశ్రమతో ఫుట్‌బాల్ ఆడారు. కాంట్రాక్టర్లతో చెడుగుడు ఆడారు. సమ్మెకు దిగుతామన్న ఆర్టీసీ కార్మికులను బెదిరించారు. రీయింబర్స్మెంట్ బకాయిలడిగినందుకు ఇంజినీరింగ్ కాలేజీలకు హెచ్చరికలు పంపారు. ఆఖరికి మెట్రో భూములపై కన్నేసి.. ఎల్అండ్టీని తరిమేసే ప్రయత్నంచేశారు. ఆ వరుసలో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!
రాయదుర్గం పన్మక్తలో తమకు కేటాయించిన భూమిని ప్రభుత్వం వేలం వేయడంపై ఎస్బీఐ న్యాయస్థానం తలుపు తట్టింది. టీజీఐఐసీ చేపట్టిన భూవేలంపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. దీంతో అప్పటిదాకా ఎకరం రూ.237 కోట్లు పలికిందంటూ జబ్బలు చరుచుకున్న సర్కార్‌కు బొబ్బలెక్కడం మొదలైంది. వందిమాగధ మీడియాతో రాయించుకున్న భజంత్రీ కథనాల డొల్లతనం బయటపడటంతో ‘అధికార’ అహం దెబ్బతిన్నది. దేశంలోనే అతిపెద్ద జాతీయరంగ బ్యాంక్ ఎస్బీఐని రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. తెలంగాణలో లీడ్‌బ్యాంక్‌గా ప్రభుత్వ పథకాలు, సర్కారీ ఆర్థిక లావాదేవీలన్నీ చూసే బ్యాంక్‌పైనే వేధింపులకు దిగింది. ఎస్బీఐ కార్యకలాపాలు సంతృప్తిగా లేవంటూ, వాటిని పునః సమీక్షిస్తామంటూ బెదిరింపులు మొదలు పెట్టింది.
పిట్ట బెదిరింపులతో ప్రభుత్వరంగాన్నే లొంగదీసుకోవాలనుకునే అజ్ఞానమిది!
అడ్డదారి పనులకు అడ్డుపడిందని జాతీయబ్యాంక్పైనే కత్తిగట్టిన అహంకారమిది!
అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాగిస్తున్నహద్దుమీరిన అరాచకమిది!
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కార్ మరోసారి దాదాగిరీకి దిగింది. తమకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసినందుకు ‘ధిక్కారమున్ సైతుమా?’ అంటూ గుడ్లురిమింది. ఇప్పటివరకు కాంట్రాక్టర్లు, కాలేజీ యాజమాన్యాలు, రియల్టర్లు, సినీ పెద్దలు, ఎల్ అండ్ టీని బెదిరించగా ఈ సారి ఏకంగా దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ‘స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)’ను టార్గెట్ చేసింది. బ్యాంకుతో ప్రభుత్వ లావాదేవీలను పునసమీక్షిస్తామని హెచ్చరికలు పంపింది. రాయదుర్గం భూముల వేలం విషయంలో ఎస్బీఐ, సర్కార్ మధ్య వివాదం మరింత రాజుకున్నది. రాయదుర్గంలో తమకు కేటాయించిన భూమిని వేలం వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎస్బీఐ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆ భూముల వేలంపై మూడు వారాలపాటు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ భూముల వేలం ద్వారా సుమారు రూ.1,500 కోట్ల ఆదాయాన్ని సర్కార్ ఆశించింది. ఎస్బీఐ ఎదురు తిరుగడంతో ఆదాయానికి గండిపడింది. ఈ వ్యవహారం రేవంత్ సర్కార్‌కు తీవ్ర కంటగింపుగా మారింది. ఎస్బీఐపై కక్ష పెంచుకున్న సర్కార్ సదరు బ్యాంకుపై బెదిరింపులకు దిగింది. ఇందులో భాగంగానే ఏకంగా సీఎంవో నుంచే ప్రముఖ టీవీ చానళ్లు, పత్రికలకు లీకులు ఇచ్చి హెచ్చరికలు ప్రసారం చేయించింది. రాయదుర్గం భూముల విషయంలో ఎస్బీఐ తీరుపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిగా ఉన్నదని, అవసరమైతే ఎస్బీఐతో ఉన్న ఆర్థిక సంబంధాలను పునఃసమీక్షించే ఆలోచన చేస్తున్నట్టు ఈ లీకుల్లో పేర్కొన్నది. ప్రభుత్వంతో వేల కోట్లలో లావాదేవీలు జరిపే ఎస్బీఐకి బిజినెస్ ఇవ్వబోమని పరోక్షంగా బెదిరింపులకు దిగింది.
ఎస్బీఐలో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లు, ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నది. ఎస్బీఐ నిర్ణయం వెనుక రాజకీయ ప్రభావం ఉన్నదా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నట్టు లీకులిచ్చింది. ఎస్బీఐ వంటి దిగ్గజ బ్యాంకు ఈ బెదిరింపులకు జడుస్తుందా? కోర్టులో కేసు వేసే ముందే ఇవన్నీ ఆలోచించుకునే రంగంలోకి దిగి ఉంటుందని బ్యాంకింగ్ నిపుణులు చెప్తున్నారు. లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న ఎస్బీఐ నుంచే మెజారిటీ రైతులకు రు ణాలు అందుతాయని, ఈ విషయంలో ఎస్బీఐ స హాయ నిరాకరణ చేస్తే సర్కార్కే ఇబ్బందులు తప్పవని ఓ సీనియర్ బ్యాంకు మేనేజర్ అభిప్రాయపడ్డా రు. సర్కార్ సూచించిన వర్గాలకు రుణాలు ఇవ్వలేదనో, తమ స్కీములకు గ్యారెంటర్‌గా ఉన్నప్పటికీ విరివిగా లోన్లు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసే ప్ర భుత్వాలను చూశామని, భూమి పంచాయతీలో బె దిరింపులకు దిగటాన్ని మొదటిసారిగా చూస్తున్నామని ఓ రిటైర్డ్ బ్యాంకు అధికారి అభిప్రాయపడ్డారు.
రాయదుర్గంలోని భూములను సర్కార్ రెండు దశల్లో టీజీఐఐసీ ద్వారా వేలంలో విక్రయించింది. ఇందులో తొలిదశలో 6.29 ఎకరాలు విక్రయించగా ఎకరం ధర రికార్డు స్థాయిలో రూ.237 కోట్లు పలికింది. తద్వారా ప్రభుత్వానికి రూ.1,490 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత రెండో దశలో రాయదుర్గంలోని 83/1 సర్వే నంబర్లోని 5.09 ఎకరాల భూమిని కూడా వేలం వేసింది. ఇక్కడ ఎకరం ధర రూ. 204 కోట్లు పలుకగా ప్రభుత్వానికి రూ.1,020 కోట్ల ఆదాయం వచ్చింది. ఇలా రెండు విడతల్లో కలిపి సుమారు రూ.2,510 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే 83/1 సర్వే నంబర్లో వేలం ద్వారా విక్రయించిన 5 ఎకరాల భూమి తమదంటూ ఎస్బీఐ కోర్టును ఆశ్రయించింది.
2010లో ప్రభుత్వం ఈ భూమిని ఎస్బీఐకి కేటాయించిందని, ఇందుకోసం ప్రభుత్వానికి రూ.13.33 కోట్లు చెల్లించినట్టు పేర్కొన్నది. ఆ తర్వాత ఎస్బీఐకి 2020లో, 2024లో భూ కేటాయింపులు రద్దు చేయడంతో ఈ వివాదం కోర్టుల్లో ఉన్నది. దీనిపై మే 4న టీజీఐఐసీ అధికారులు ఎస్బీఐ అధికారులతో చర్చించారు. ఆ తర్వాత రెండు రోజులకే వేలం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఎస్బీఐ కోర్టును ఆశ్రయించింది. వేసవి సెలవులు కావడంతో కేసు జూన్‌కు వాయిదా పడింది. అంతలోనే మే 20న ఎస్బీఐ వినతి పత్రాన్ని తిరస్కరించిన ప్రభుత్వం వేలం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వేలంపై స్టే ఇచ్చింది.
ఎదురుతిరిగిన వాళ్లు, ఆదేశాలను ధిక్కరించిన వాళ్లను దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ బెదిరింపుల రాజకీయం చేస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాగిరీని ప్రదర్శిస్తూ వారిని దారిలోకి తెచ్చుకుంటుందనే ఆరోపణలున్నాయి. ఇలా కాంగ్రెస్ సర్కార్ బెదిరింపుల జాబితాలో బా ధితుల సంఖ్య భారీగానే ఉన్నది. ఇప్పుడు ఆ జాబితాలో ఏకంగా ప్రభుత్వరంగ సంస్థ, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ చేరడం గమనార్హం. తాజాగా రాయదుర్గం భూముల వేలానికి వ్యతిరేకంగా పని చేసిందనే కారణంతో ఎస్బీఐపై లీకులతో బెదిరింపులకు పాల్పడుతున్నది.
ఎస్బీఐతో ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక సంబంధాలను రద్దు చేస్తామని, డిపాజిట్లు, ఖాతాలను ఇతర బ్యాంకుల్లోకి మార్చుతామంటూ మీడియా ద్వారా హెచ్చరికలు వచ్చాయి. ఎస్బీఐకి లీడ్ బ్యాంకు హోదాను రద్దు చేసి ఆ స్థానంలో మరో బ్యాంకుకు కట్టబెడుతామని బెదిరింపులకు దిగింది. ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు, వేతనాల చెల్లింపులు, ఇతర కార్యక్రమాల్లో ఎస్బీఐ కీలకంగా ఉన్నది. ప్రతినెలా కనీసం రూ.20-23 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు ఎస్బీఐ ద్వారానే జరుగుతాయని తెలిసింది. ప్రభుత్వం మొండిగా ముం దుకెళ్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదని ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.