BuildNow Portal | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణ కలలు కల్లలైపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆన్లైన్లో ఇండ్ల నిర్మాణ అనుమతులు ఇచ్చిన టీజీబీపాస్ను ఆకస్మికంగా మూసివేశారు. దానిస్థానంలో కాంగ్రెస్ సర్కారు కొత్తగా బిల్డ్‌నౌ పోర్టల్ తీసుకొచ్చింది. కానీ, అది సక్రమంగా పనిచేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గత నెల రోజులుగా భవన నిర్మాణ అనుమతులు రాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ శాఖను నిర్వహిస్తున్నప్పటికీ, సమస్యలు పరిషారం కావడం లేదు.
బిల్డ్‌నౌ యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుందని డ్రాయింగ్స్ పరిశీలన నిమిషాల్లోనే పూర్తవుతుందని, ఇంటి అనుమతి మరింత సులభమవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి దానిని ప్రారంభించినప్పుడు ప్రకటించారు. అది ప్రారంభమై ఇప్పటికీ నెల రోజులు దాటినా.. పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. టెక్నికల్ లోపాలు నేటికీ వెక్కిరిస్తూనే ఉన్నాయి. కానీ, ఆన్లైన్లో సులభంగా ఇండ్ల అనుమతులు ఇచ్చిన టీజీ బీపాస్‌ను టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు నిలిపివేశారు. ప్రాసెస్‌లో ఉన్న దరఖాస్తులు మినహా కొత్తవి బిల్డ్‌నౌ విధానంలోనే తీసుకుంటామని స్పష్టంచేశారు. దాంతో పాతది పనిచేయక, కొత్తది అందుబాటులోకి రాక నరకం చూస్తున్నారు. ఇల్లు, అదనపు అంతస్తుల నిర్మాణ అనుమతుల కోసం బిల్డ్‌నౌను ఆశ్రయిస్తే నిర్మాణదారులకు ఇక్కట్లు తప్పడం లేదు.
డీటీసీపీశాఖ వైఫల్యం
టీజీ బీపాస్‌లో కాడ్ ఫైల్ అప్లోడ్ చేయాలంటే ముందుగా ప్రీ డీసీఆర్లో కాడ్ ఫైల్ రన్ చేయాలి. అది సుమారు 15 రోజులుగా పనిచేయడం లేదు. దీనితో సింగిల్ విండో సిస్టమ్ ఫైల్స్‌ను టీజీ బీపాస్‌లో దరఖాస్తు చేయడం వీలుకావడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో మాత్రమే కొంత పనిచేస్తున్నది. డీటీసీపీ ఏరియాల్లో అంటే.. రాష్ట్రంలో ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో బిల్డ్‌నౌ పూర్తిస్థాయిలో అభివృద్ధి కాకపోవడంతో నిర్మాణదారులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. బిల్డింగ్ పర్మిషన్ల ఫైల్స్ పెద్ద మొత్తంలో పేరుకుపోతున్నాయి.
డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంస్థ (డీటీసీపీ) వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ శాఖ సీఎం రేవంత్‌రెడ్డి చేతిలోనే ఉండటం, ఫిర్యాదు చేస్తే కక్షసాధింపు చర్యలు ఉంటాయనే ఉద్దేశంతో అధికారులకు ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. నల్లగొండలో ఇప్పటికే నిర్మించిన ఇంటిపై అదనపు అంతస్తు అనుమతి కోసం ఓ ఇంటి యజమాని నెల రోజులుగా పడరాని పాట్లు పడుతున్నారు. ఏ ఒక్క అధికారీ ఆయన సమస్యను పరిష్కరించడం లేదు. బిల్డ్‌నౌలో టెక్నికల్ సమస్యలు కూడా వేధిస్తున్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ), ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) అప్లికేషన్లకు ఆప్షన్ కనిపించడం లేదు. బిల్డ్‌నౌ విధానంలో ఎదురవుతున్న సమస్యలపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా డీటీసీపీ అధికారులు స్పందించలేదు.