మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 16 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. శనివారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని కురవి గేటు వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవితతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో వద్దిరాజు మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి మృతిచెందిన గీత కార్మికులకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియోను ప్రభుత్వం వెంటనే అందజేయాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవడంలేదని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్‌పై 2018లోనే అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానంచేసి కేంద్రానికి పంపారని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో బీసీలకు సముచిత స్థానం లభించిందని పేర్కొన్నారు. కలెక్టరేట్లు, ఎస్పీ బంగ్లాలు, మెడికల్, హార్టికల్చర్, ఇంజినీరింగ్ కళాశాలలు బీఆర్ఎస్ హయాంలోనే వచ్చాయని తెలిపారు. పాపన్న స్ఫూర్తితో బీసీలు పోరాటాలు చేయాలని చెప్పారు.