Musi Riverfront Project | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘సియోల్ నగరంలో ఉన్న విధంగానే మన హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి నది ప్రవహిస్తుంది. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఇంతకు ముందు ఇక్కడికి టూర్‌కు వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు మమ్మల్ని పంపించిండు. చుంగ్ గై చున్ పక్కనే రెస్టారెంట్లు, ఇవన్నీ (ఆకాశహర్మ్యాలు) వచ్చినయి. ఇవన్నీ పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్) విధానంలో కట్టిన ప్రాజెక్టులు. హైదరాబాద్‌లోని మూసీని కూడా ఇట్ల తయారు చేస్తే ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుంది’
ఇవీ.. దక్షిణ కొరియా సియోల్‌లో చుంగ్ గై చున్ వాగు పక్కన నిలబడి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సెలవిచ్చిన వివరాలు.. సియోల్ పర్యటనకు వెళ్లిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ సైతం ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తంచేశారు.
అంటే.. మూసీ ఇరువైపులా చుంగ్ గై చున్ వాగు పరిసరాల లెక్క మారుస్తారని సదరు మంత్రులు, ఎంపీ అధికారికంగానే చెప్పారు..మూసీ వెంట ఇంత పెద్ద ఆకాశహర్మ్యాలు రావాలంటే బఫర్‌జోన్ దాటి కిలోమీటర్ మేర విస్తరణ చేస్తారని మరోసారి చెప్పకనే చెప్పారు! ఇప్పటివరకు రేవంత్ సర్కారు బయటికి బఫర్‌జోన్ వరకు ఉన్న 10 వేల నిర్మాణాలనే కూల్చుతామని చెప్తున్నా.. ప్రజాసంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో నదికి రెండు వైపులా కిలోమీటర్ మేర అభివృద్ధి చేస్తామని పొందుపర్చారు. తాజాగా సియోల్ పర్యటనలో మంత్రులు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.
మూసీ ప్రాజెక్టులో ఇప్పటివరకు 150 నిర్మాణాలను కూల్చివేశారు. స్వచ్ఛందంగా వారే కూల్చుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నా.. ప్రభుత్వపరంగా బిల్లులు క్లెయిమ్ చేస్తుండటంతో అవి సర్కారు కూల్చివేతలేనని తేటతేల్లమైంది. ఈ నేపథ్యంలో అసలు 55 కిలోమీటర్ల మేర మూసీ వెంబడి రెండువైపులా ఎంత దూరం సుందరీకరణ ప్రాజెక్టు చేపడతారనే వాస్తవాలను కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి చెప్పడం లేదు. కానీ తరచూ చోటుచేసుకుంటున్న పరిణామాలతో సర్కారు అంతర్గత వ్యూహం బట్టబయలవుతున్నది. కొన్నిరోజుల కిందట సాక్షాత్తూ మంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రజా సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో స్పష్టంగా నదికి రెండు వైపులా కిలోమీటర్ చొప్పున 55 కిలోమీటర్ల దాకా 110 చదరపు కిలోమీటర్ల మేర గ్రోత్కారిడార్గా అభివృద్ధి చేస్తామని కుండబద్దలు కొట్టారు. దీంతో రివర్ బెడ్‌లెవల్, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలను కూల్చివేసి వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నారు. ఆపై కిలోమీటర్ వరకు నిర్మాణాలు, స్థలాలను భూసేకరణ చట్టం-2013 కింద సేకరించనున్నట్టు ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్‌లోనే స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చిన తర్వాత కూడా అటు ప్రభుత్వ, ఇటు అధికార యంత్రాంగం నోరు విప్పడం లేదు. వాస్తవానికి కిలోమీటర్ దాకా విస్తరణ లేకపోతే అదే విషయాన్ని ఎంఆర్డీసీఎల్ అధికారులు ప్రజలకు స్పష్టం చేయాల్సి ఉన్నది. కానీ మౌనం వహిస్తున్నారంటే మున్ముందు అదే ప్రణాళిక అమలు చేయనున్నట్టు స్పష్టమవుతున్నది.
సియోల్ టూర్‌తో మరోసారి ఖరారు
మూసీ సుందరీకరణపై పలువురు మంత్రు లు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధుల బృం దం దక్షిణ కొరియాలోని సియోల్ టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చుంగ్ గై చున్ వాగు పక్కన నిలబడి ఇదే తరహాలో మూసీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. పక్కన ఉన్న ఆకాశహర్మ్యాల్లో ఉన్న రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య కేంద్రాలను చూపుతూ ఇట్లనే మూసీ వెంట అభివృద్ధి జరుగుతుందని సెలవిచ్చారు.
రెండువైపులా ఎక్స్‌ప్రెస్‌వే
బీఆర్ఎస్ హయాంలో మూసీ అభివృద్ధి ప్రణాళికలో ఒక్క నిరుపేద నిర్మాణాన్ని కూడా కూల్చవద్దంటూ అప్పటి సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో అందుకు అనుగుణంగా మంత్రులు, అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మూసీ నది మీది నుంచి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది. అంటే మూసీ నదిలో పిల్లర్లు వచ్చి, నది పైనుంచి రోడ్డు ఉంటుంది. దీని ద్వారా ఎలాంటి నిరుపేదల నిర్మాణాలను కూల్చాల్సిన అవసరం ఉండదు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అలా కాకుండా మూసీకి రెండువైపులా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాలను ప్రతిపాదించింది. అంటే నది సరిహద్దు నుంచి 250-350 ఫీట్ల చొప్పున స్థలం కావాలి. ఇలా రెండువైపులా భూములు సేకరించాలి.
సియోల్‌లో మాటల గారడీ!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకు చివరికి సియోల్‌లోనూ కాంగ్రెస్ నేతలు మాటల గారడీని అందుకున్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ చుంగ్ గై చున్ వాగు పునరుజ్జీవనం కంటే ముందు అక్కడ కేవలం నది మాత్రమే ఉండేదని అసత్యాలు వల్లించారు. వాస్తవానికి పునరుజ్జీవనం ప్రాజెక్టు 2003-05 వరకు జరిగితే.. అంతకుముందు ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయో, ఆతర్వాత కూడా అవే ఆకాశహర్మ్యాలు ఉన్నాయి.
ఇంతమంది ఉసురు పోసుకోడానికా సీఎంను చేసింది?
మూసీ కాల్వను శుభ్రం చేసి నీళ్లు పోసి గోడ కట్టుకోమను. ఆయన (సీఎం) చరిత్రల నిలబడుతడు. మూసీ మురికిపోయి దగ్గరున్నోళ్లు దోమలు, వాసన లేకుండా సంతోషంగా ఉంటరు. అది వదిలిపెట్టి అటు కిలోమీటర్, ఇటు కిలోమీటర్ కూలగొడుతరా ఎవరైనా? ఎవని జాగీరు?.. ఎవని సొమ్ము? కిలోమీటర్ అంటే మాటలా? ఈ జమానాలో అది సాధ్యమా? సిమెంట్, ఇసుక ఎంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటరు?. ఇంత అద్రగనంగ మాట్లాడి, ఇంతమంది ఉసురు పోసుకునేందుకేనా ఆయన్ని సీఎంను చేసింది?
– శోభ, గృహిణి, మూసీ పరీవాహక ప్రాంతం