జగిత్యాల, సెప్టెంబర్ 18: ‘కాంగ్రెస్ ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్న రుణమాఫీ పూర్తిగా అంకెల గారడీ. చేసింది గోరంత అయితే, చెప్పుకునేది కొండంత’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. జిల్లాలో రుణమాఫీ కాని రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, రైతులతో కలిసి బుధవారం కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.
రుణమాఫీ కానీ రైతుల వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కుర్చీలో కూర్చునే దాకా ఓ మాట, కూర్చున్నాక మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. డిసెంబర్ 9న రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా కింద పంట పెట్టుబడి, రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని మాయ మాటలు చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారని మండిపడ్డారు.
కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు పైసలే రుణమాఫీకి డైవర్ట్ చేశారని, అనేక ఆంక్షలు పెట్టి వేలాది మందికి మాఫీ ఎగ్గొట్టారని, పైకి మాత్రం రైతులందరికీ రూ.2లక్షలు మాఫీ చేసి బడాయి కొడుతున్నారని ధ్వజమెత్తారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని, లేదంటే రైతు ఉద్యమం మొదలవుతుందని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.