హైదరాబాద్, ఫిబ్రవరి2 (నమస్తే తెలంగాణ): రాజీవ్ యువవికాసం (ఆర్వైవీ) పథకంపై ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం యువతకు అతీగతీ లేకుండా చేసింది. సబ్సిడీ రుణాలను అందిస్తామని ఊదరగొట్టి, ప్రకటన పేరిట ప్రచారం చేసుకున్న సర్కార్.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఆ పథకం దరఖాస్తుల స్వీకరణతోనే అటకెక్కించింది. ఏడాది గడచినా ఇప్పటికీ రుణాలు మంజూరు చేయనే లేదు.
ప్రభుత్వ పెద్దలను అడిగినా స్పందన కరువైంది. మరోవైపు గత బీఆర్ఎస్ హయాంలో రుణాల కోసం యువత చేసుకున్న దరఖాస్తులను సైతం ఆన్లైన్ నుంచి పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ తొలగించి, ఏకంగా రద్దు చేసింది. దీంతో అసలు ఈ ప్రభుత్వం రుణాలను ఇస్తుందా? ఇవ్వదా? అనేది తెలియక యువత ఆందోళన చెందుతున్నది. తక్షణం రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది.
ఏడాదిగా దరఖాస్తులకే పరిమితం ఆర్వైవీ పథకం పేరిట స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలను అందిస్తామంటూ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సర్కార్ ఊదరగొట్టింది. గత ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా పథకం కోసం రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది యువతకు జూన్ 2 నుంచి 9 వరకు రుణాలను మంజూరు చేస్తామని ఊదరగొట్టింది. పత్రికా ప్రకటనలు సైతం జారీచేసింది. రుణాల కోసం ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులను స్వీకరించగా, రాష్ట్రవ్యాప్తంగా 16,23,643 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది.
జనాభా దామాషా, క్యాటగిరీల వారీగా మంజూరైన యూనిట్లకు 2025 మే 20వ తేదీలోగా అర్హులను మండలస్థాయి కమిటీలు ఎంపిక చేయాలని, ఆ జాబితాలను జిల్లా కమిటీలు పరిశీలించి అదే నెల 31లోగా తుది జాబితాను సిద్ధంచేసి ఇన్చార్జి మంత్రి ఆమోదంతో లబ్ధిదారులను ప్రకటించాలని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 జూన్2 నుంచి 9వ తేదీ వరకు లబ్ధిదారులకు రుణాల మంజూరు పత్రాలను పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ ఆనాడు హడావుడి చేసింది.
ఆర్వైవీ పథకం దరఖాస్తుదారుల్లో 70 శాతం మంది యువతకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. మొత్తంగా 30 శాతం మందికే రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. పథకాన్ని మొత్తంగా 5 దశల్లో అమలు చేయాలని, తొలుత రూ.50 వేల యూనిట్లు, ఆఖరున రూ.4 లక్షల యూనిట్లను మంజూరు చేయాలని ప్రకటించింది. జూన్ 2నే రాష్ట్రవ్యాప్తంగా యువతకు యువవికాసం రుణాల ప్రొసీడింగ్స్ అందిస్తామంటూ హడావుడి చేసింది. అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. ఆచరణలో ఏడాది గడచినా ఆ ప్రక్రియ నేటికి ఒక్క అడుగు కూడా ముందుకు పడని దుస్థితి నెలకొన్నది. నాడు హడావుడి చేసిన సర్కార్.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం రాజీవ్ యువవికాసం పథకాన్ని సైతం ఉచ్ఛరించడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో స్వయంఉపాధి కోసం దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంధు కోసం 5,28,862 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 4.13 లక్షల మందిని అర్హులుగా గుర్తించి 40 వేల మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇంకా 3.73 లక్షల మంది వెయిటింగ్ జాబితాలో ఉన్నారు. మైనారిటీ బంధు పథకానికి 2.16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 11 మందికి మంజూరు చేశారు. ఇంకా 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
దళితబంధు పథకం మినహాయించి ప్రత్యేకంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా స్వయం ఉపాధి కోసం యువత నుంచి నాడు దరఖాస్తులు స్వీకరించింది. అవికూడా దాదాపు 3లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని గణాంకాలు చెప్తున్నాయి. సెర్ప్, మెప్మా తదితర డ్వాక్రా సంఘాల కింద మొత్తం కలిపి దాదాపు సబ్సిడీ రుణాల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇవిగాకుండా ట్రైకార్ సంస్థ ద్వారా 2019-2021 సంవత్సరాల్లో గిరిజన యువతీ యువకుల నుంచి దరఖాస్తులను స్వీకరించిందని, అందులో 30 వేల మందికి రుణాలను మంజూరు చేసిందని తెలిపారు.
వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి రూ.219 కోట్ల విలువైన చెకులను సిద్ధం చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపింది. ఇప్పటికీ నిధులను విడుదల చేయలేదు. ఇదిలా ఉంటే అన్ని కార్పొరేషన్లు కలిపి స్వయం ఉపాధి కోసం యువత చేసుకున్న గత దరఖాస్తులే 12లక్షలకు పైగా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఆన్లైన్లో పెండింగ్లో ఉన్న ఆ దరఖాస్తులన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రద్దుచేసింది. దరఖాస్తులను ఆన్లైన్ నుంచి పూర్తిగా తొలగించింది. దీంతో సదరు అర్జీదారులు రెండు విధాలుగా నష్టపోయిన పరిస్థితి నెలకొన్నది.