హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎంతో గొప్ప మనసుతో కుల సంఘాల భవనాల నిర్మాణం కోసం స్థలాలు కేటాయిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నిర్మాణాలను పూర్తిగా మరచిపోయింది అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి విమర్శించారు. మండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ కుల సంఘాల భవనాల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరుగడం లేదని, కాంగ్రెస్ సర్కార్ నిరాశా నిస్పృహలతో ఉన్నట్టు స్పష్టమవుతున్నదని ఎద్దేవా చేశారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. కులసంఘాలపై బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి సరైన సమాధానం రాలేదు అని మండిపడ్డారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలపై సర్కార్ దృష్టి పెట్టడంలేదని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీల కోసం ఐదేండ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు ఎన్ని కోట్లు కేటాయించారో తెలియచేయాలని బండా ప్రకాశ్ డిమాండ్‌చేశారు. బీసీల సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి బీసీ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటుచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ సురభివాణీదేవి మాట్లాడుతూ జమ్మికుంటలోని వావిలాల చేనేత కార్మికులకు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత కరెంటు ఏ మాత్రం సరిపోవడం లేదని చెప్పారు. కుటీర పరిశ్రమల వారికి కూడా ఉచిత విద్యుత్తు యూనిట్లు పెంచాలని కోరారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఎల్ రమణ మాట్లాడుతూ.. కొండగట్టు ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని విమర్శించారు. గుడి నిర్మాణం కోసం బీఆర్ఎస్ సర్కారు రూ.100కోట్లు కేటాయిస్తూ.. జారీచేసిన జీవోను పరిశీలించారా? లేదా? అని ప్రశ్నించారు.
బీసీల సమస్యల పరిష్కారంపై త్వరలోనే బీసీ సంఘాల ప్రతినిధులు, నేతలతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. బీసీల అభివృద్ధి కోసం ఎస్డీఎఫ్ నుంచి అధిక నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.