హైదరాబాద్ సిటీబ్యూరో/ ఖైరతాబాద్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): అంగన్వాడీలపై పోలీసులు అమానుషం ప్రదర్శించారు. మహిళలని చూడకుండా ఈడ్చిపడేశారు. ఇష్టానుసారంగా నెట్టివేశారు. వివిధ స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. పొద్దంతా ఠాణాల్లోనే ఉంచి ఆకలికి అలమటించేలా చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లపై ప్రభుత్వం దౌర్జన్యకాండను ప్రదర్శించింది. అణచివేసేందుకు పోలీసులను ఉసిగొల్పింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వివిధ స్టేషన్లలో నిర్బంధంలో ఉన్న అంగన్వాడీలు బతుకమ్మ ఆడి నిరసనలు వ్యక్తంచేశారు. అంగన్వాడీలపై కాంగ్రెస్ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సచివాలయ ముట్టడికి యత్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా వందలాదిగా సచివాలయానికి తరలివచ్చారు. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీ, దోమలగూడ, ఇందిరాపార్కు, ట్యాంక్‌బండ్ మీదుగా వచ్చిన 400 మంది అంగన్వాడీలు సచివాలయం వైపు వచ్చారు. కొందరు అంగన్వాడీలు ప్రభుత్వ తీరును నిరసిస్తూ మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సుల్లో తరలివచ్చారు. వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి, ముషీరాబాద్, నారాయణగూడ, చిక్కడపల్లి సహా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు ఇష్టానుసారంగా ఈడ్చుకెళ్లడంతో ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ వద్ద ఓ అంగన్వాడీ కార్యకర్త స్పృహ తప్పి పడిపోయారు.
పోలీసులు నెట్టేయడంతో ఓ అంగన్వాడీ హెల్పర్ తన చెయ్యికి గాయమైందని, మందులు తెచ్చుకుంటానని ప్రాధేయపడ్డా పోలీసులు పట్టించుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ సేవలను గుర్తించి సీఎం, మంత్రి సీతక్క చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. తాము ఏం తప్పు చేశామని ఇష్టానుసారంగా ఈడ్చుకొచ్చి స్టేషన్లలో నిర్బంధించారంటూ నిలదీశారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లవుతున్నా తమ గోడు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పోలీసుల అక్రమ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు ఆయాచోట్ల నినాదాలు చేశారు.
ఐసీడీఎస్‌ను, విద్యావ్యవస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కే సునీత, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ విమర్శించారు. ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన వారు అంగన్వాడీల అరెస్టును తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా తమ హక్కుల సాధన కోసం వచ్చిన అంగన్వాడీలపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని నిరసించారు.
విద్యా బోధనా బాధ్యతలను అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకే ఇస్తూ అదనపు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సేవలకు తప్పనిసరి చేసిన ఫేస్ క్యాప్చర్ (ఎఫ్ఆర్ఎస్) విధానం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇచ్చిన సెల్ఫోన్లు పనిచేయడం లేదని తెలిపారు. తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేయాలని, 5జీ నెట్‌వర్క్‌తో కూడిన సెల్ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనం చెల్లించాలని కోరారు. సీనియార్టీని బట్టి ఇంక్రిమెంట్ చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటనలో విమర్శించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించిన అంగన్వాడీలను అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కార్యక్రమానికి ముందు రోజే వివిధ జిల్లాలలో ఎక్కడికక్కడ అంగన్వాడీలను అరెస్టు చేయడాన్ని ఖండించారు. వారితో ప్రభుత్వం చర్చించి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.