హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ కక్కలేక.. మింగలేక సతమతమవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ తాజాగా ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. కానీ ఆయన రిజర్వేషన్లపై ఏమీ తేల్చలేదు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను 30 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయాలని హైకోర్టు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో ప్రజలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పలేక, పాత పద్ధతిలో ముందుకు సాగకలేక ముందు ను య్యి.. వెనుక గొయ్యిలా రేవంత్ సర్కార్ పరిస్థితి తయారైంది. రాష్ట్రంలోగ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని హైకోర్ట్ స్పష్టంచేసింది. మొదటి 30 రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలని, ఆ తర్వాతి 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు విధించిన గడువు శుక్రవారంతో ముగియనున్నది.
బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ అమలుకు ప్రస్తుతం బ్రేక్ పడిన నేపథ్యంలో పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లడమే మిగిలిందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. కాంగ్రెస్ ముందు నుంచి చెప్తున్నట్టుగా పార్టీపరంగా 42 శాతం టికెట్లు బీసీలకు ఇస్తామని ప్రకటించే అవకాశం ఉన్నదని అంటున్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్ సర్కారు బీసీకు తీవ్ర అన్యాయం చేసినట్టే అవుతుందని చెప్తున్నారు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా పార్టీ టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం బీసీలను వంచించడమేనని మండిపడుతున్నారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన ఖరారు కానున్నందున వాటి విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. కానీ వార్డు స్థానాల నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ స్థానాల వరకు రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. ఈసారి నిర్ణయించే రిజర్వేషన్లు ఒక టర్మ్ మాత్రమే ఉంటాయని, అందువల్ల రిజర్వేషన్ స్థానాల్లో అనేక మార్పులు సంభవిస్తాయని వివరిస్తున్నారు.