TG Budget | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల్లో భారీగా కోత విధించింది. గత ఏడాది కంటే దాదాపు రూ.2,491 కోట్లను తగ్గించింది. అయినప్పటికీ జనాభా దామాషా ప్రకారం నిధులను ఎక్కువ కేటాయించామంటూ అంకెల గారడీకి తెరలేపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రగతిపద్దు వ్యయం రూ.1,84,415 కోట్లలో ఎస్సీలకు జనాభా ప్రకారం 15.45 శాతం నిధులను కేటాయించాల్సి ఉండగా, అంతకుమించి 20.47 శాతం నిధులు అంటే రూ.37,741 కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. గత బడ్జెట్లో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.40,232 కోట్లు కేటాయించిన ప్రభుత్వం..ఈసారి అంతకు తక్కువగా నిధులను కేటాయించింది. ఎస్టీలకు 10.16 శాతం అంటే రూ.18,415 కోట్లను ప్రతిపాదించింది. గతేడాదికన్నా స్వల్ప ంగా రూ.1,246 కోట్లను పెంచినట్టు పేర్కొంది. ప్రభుత్వం ఇక్కడే అంకెల గారడీకి తెరతీసింది.
కాంగ్రెస్ సర్కార్ 2024-25 బడ్జెట్లో ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్సీఎస్డీఎఫ్) కింద రూ.33,127 కోట్లు కేటాయించింది. ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌కు రూ.17,056 కోట్లు కేటాయించింది. కానీ ఆ కేటాయింపుల్లో సగం కూడా ఖర్చు చేయని దుస్థితి నెలకొన్నది. ఎస్సీఎస్డీఎఫ్ కింద కేవలం రూ.14,148 కోట్లు (42,71శాతం) మాత్రమే వెచ్చించింది. ఇక ఎస్టీ ఎస్డీఎఫ్ నిధుల్లో రూ.9,773 కోట్లు (57.30శాతం) మాత్రమే ఖర్చుచేసింది. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద కేటాయించిన నిధుల్లో సగానికిపైగానిధులు మిగిలిపోయాయి. చట్టం ప్రకారం ఆ నిధులను కొత్త బడ్జెట్లో పొందుపరచాలి. కానీ ప్రస్తుత బడ్జెట్లో వాటి ఊసే ఎత్తలేదు.
సబ్‌ప్లాన్ కింద ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను ఆ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయకపోతే.. ఆ మిగిలిన మొత్తాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేయాలి. ఎస్సీ, ఎస్టీల నిధులను దారిమళ్లించకుండా ఉండేందుకు 2017లో కేసీఆర్ ప్రభుత్వం సబ్‌ప్లాన్ చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించింది. నిధుల ఖర్చుకు గతంలోపదేండ్ల కాలపరిమితి ఉండ గా, కేసీఆర్ సర్కార్ ఆ నిబంధనను తొలగించింది. నిర్ణీత ఆర్థిక సంవత్సరంలో ఉపయోగించని సబ్‌ప్లాన్ నిధులను తదుపరి ఆర్థిక సంవత్సరంలోనే వినియోగించుకునేలా నష్టపరిహారం రూపంలో నిబంధనను చేర్చింది.
కానీ ప్రస్తుత బడ్జెట్లో సబ్‌ప్లాన్ మిగులు నిధులకు సంబంధించి ఏవిధమైన స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం కేటాయించిన నిధుల్లోనే ఆ మిగిలిపోయిన వాటిని కూడా కలిపారా అన్నది వెల్లడించలేదు. ప్రస్తుత ప్రగతి పద్దులో 15.45 శాతం ఎస్సీ కోటా అయితే రూ.28,492 కోట్లు కేటాయించాలి. కానీ 20.47 శాతం అధికంగా కేటాయించామని కాంగ్రెస్ ప్రభుత్వం బుకాయిస్తున్నది. వాస్తవంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.18,791 కోట్లు మిగిలిపోయాయి. ఆ నిధులను కూడా కలిపితే మొత్తంగా ఈ బడ్జెట్లో రూ.47,471 కోట్లు కేటాయించాలి. కానీ రూ.37,741 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎస్సీలకు అదనంగా కేటాయించడం కాదు, దక్కాల్సిన వాటాలోనే కోత పెట్టింది. ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి నిధులపైనా ఇదే గందరగోళం నెలకొన్నది.