Job Calender | జాబ్ క్యాలెండర్ కాస్త జోక్ క్యాలెండర్‌గా అయిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీవన్నీ బక్వాస్ మాటలని మండిపడ్డారు. ఒక్కటన్నా మాటపైనా నిలబడ్డారా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. వడ్లకు రూ.500 బోనస్ అని చెప్పి, 10 శాతం పండే సన్నరకానికి ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారని అన్నారు. మహిళలకు రూ.2500 అని మోసం చేశారు.. వృద్ధులకు 4వేల పెన్షన్ అని మోసం చేశారని మండిపడ్డారు.
కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నేటి క్యాలెండర్ బోగస్‌గా మారిందని మండిపడ్డారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలిస్తామని అశోక్‌నగర్‌లో రాహుల్‌గాంధీ చెప్పలేదా అని గుర్తుచేశారు. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 8 నెలలు గడిచిపోయింది.. ఇంకా నాలుగు నెలలు మిగిలిందని తెలిపారు.. ఏదో జాబ్ క్యాలెండర్ ఇస్తారంటే.. నిజంగానే రెండు లక్షల ఉద్యోగాలిస్తారేమో అనుకున్నామన్నారు. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు చూపించి, అసలు ఎన్ని జాబ్‌లు ఇస్తారో లెక్క చెప్పకుండా ఓ డ్రామా ఆడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అది బోగస్ అని వాళ్లకు తెలుసు కాబట్టే.. దాని మీద చర్చ లేదని అంటున్నారని చెప్పారు. చర్చ చేయమంటే పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
నిజంగానే రెండు లక్షలు ఇచ్చేది ఉంటే.. చర్చకు ఎందుకు భయపడ్డరని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలోని నిరుద్యోగయువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా.. కీనం 20వేల లెక్క కూడా చెప్పట్లేదని అన్నారు. గతంలో తమ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలే తప్ప కొత్త ఉద్యోగాల లెక్క ఏదని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని మోసం చేసిందని మండిపడ్డారు. దగా చేసిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని నిరుద్యోగులు అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు.
కౌరవుల సభలాగా, మందబలం ఉందని.. అధికారం ఉన్నదని, మార్షల్స్, పోలీసులను పెట్టుకుని మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. సభలో మీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారేమో కానీ.. మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా నిరుద్యోగులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెంటపడరని స్పష్టం చేశారు.