హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ‘నెమళ్లు, జింకలు, పక్షులు, చెరువులు, శిలలకు నెలవైన హెచ్‌సీయూకి చెందిన 400 ఎకరాల భూములను కొట్టేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జి జరుగుతుంటే, తమ జీవితాలను పణంగా పెట్టి విద్యార్థులు పోరాడుతుంటే.. తెలంగాణ మేధావులారా.. ఎందుకు మౌనమునుల్లా మారిపోయారు? ఎందుకు విద్యార్థుల తరఫున మాట్లాడటం లేదు?’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తెలంగాణ మేధావులను సూటిగా ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లను కూల్చుతుంటే ప్రొఫెసర్ కోదండరాం లాంటి మేధావులు ఎందుకు వారికి మద్దతుగా నిలవడం లేదు. హెచ్‌సీయూలో దళితులు, బహుజన విద్యార్థుల వీపులు చిట్లుతుంటే.. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఎందుకు వారి పక్షాన మాట్లాడటం లేదు? అనేక జీవాల మనుగడకు ముప్పు వాటిల్లుతున్న తరుణంలో ప్రకృతి ప్రేమికుడు జయరాజ్ ఎక్కడికిపోయారు? లగచర్లలో లంబాడీలపై పోలీసులు విచక్షణారహితంగా దమనకాండ జరుపుతున్నప్పుడు మేధావులు ఎందుకు స్పందించలేదు? సీఎం రేవంత్‌రెడ్డి మేధావుల భుజాలపై నుంచి పాలన చేస్తున్నారు.
బీఆర్ఎస్ పాలనలో నోరు విప్పి మాట్లాడిన ఆ మేధావులంతా ఇప్పుడు ఎక్కడికిపోయారు? మేం ప్రజల కోసం పని చేస్తామని, మాది ప్రతిపక్షమని చెప్పేవారిది ఇప్పుడు ఏ పక్షం? ‘రోహిత్ వేముల కోసం అప్పట్లో వచ్చిన రాహుల్‌గాంధీ ఇప్పుడు ఎందుకు రావడం లేదు? మేధావులు ప్రజాస్వామిక స్ఫూర్తిని ఎందుకు మర్చిపోయారు? చరిత్రలో దోషులుగా నిలబడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? సమాజం పట్ల బాధ్యత ఉందా, లేదా? అనేది వారు తేల్చుకోవాలి. ‘తెలంగాణ మేధావులారా.. సాహితీవేత్తలారా.. ఇప్పటికైనా మేల్కొనండి’ అని దేశపతి పిలుపునిచ్చారు.