హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 42 డైటీషియన్ పోస్టుల భర్తీలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో డైటీషియన్ పోస్టులు క్రియేట్ అయ్యాయి. అయితే ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన ఈ పోస్టులను రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ నాన్చుతున్నది.
రోగులకు నాణ్యమైన ఆహారం అందించడంలో డైటీషియన్లది కీలకపాత్ర. ఆ పోస్టులు ఖాళీగా ఉండటంతో పేషెంట్లకు నాణ్యమైన ఆహారం అందడం లేదనే ఆరోపణలున్నాయి. అర్హులైనవారి సీనియార్టీ లిస్టు కోసం ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఎలిజిబులిటీ ఆధారంగా కాల్‌ఫర్ చేసి హడావిడి చేసిన అధికారులు ప్రక్రియను మాత్రం అటకెక్కిస్తున్నారనే విమర్శలున్నాయి. డైటీషియన్ల విద్యార్హతల విషయంలో అనేక కొర్రీలు పెడుతూ ఈ ప్రక్రియను ముందుకు సాగనివ్వడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు.
ఫేక్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు డీఎంఈ యూజీసీకి లేఖ రాయగా.. నాలుగు నెలల క్రితం ప్రభుత్వానికి యూజీసీ పూర్తి వివరాలతో సమాధానం ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఆ వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని పలువురు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నవారు ఉంటే వారిపై చర్యలు తీసుకుని.. సర్టిఫికెట్లు సరిగ్గా ఉన్నవారికి ఉద్యోగోన్నతి కల్పించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఏడాది 51 మందితో డైటీషియన్ల ప్రొవిజనల్ జాబితాను డీఎంఈ కార్యాలయం విడుదల చేయగా.. మల్టీ జోన్-1 పరిధిలో 20 పోస్టులకు 31 మంది, మల్టీ జోన్-2 పరిధిలో 22 పోస్టులకు 20 మంది అభ్యర్థులు లిస్టులో ఉన్నారు. వీరి సర్టిఫికెట్లను గత నెల 10న వెరిఫికేషన్ చేపట్టారు. ఆ సమయంలో ఇద్దరు అధికారులు లేకుండానే సర్టిఫికెట్ల ప్రక్రియను మిగతా అధికారులు పూర్తి చేశారు. దీంతో తాము లేకుండా ప్రక్రియ ఎలా పూర్తి చేస్తారంటూ ఆ ఇద్దరు అధికారులు కొర్రీ పెట్టారు.
మరోసారి వెరిఫికేషన్ చేయాల్సిందేనని పట్టుబట్టడంతో ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. మరోవైపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయి నెల గడుస్తున్నా తుది జాబితా విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డీఎంఈ కార్యాలయం, సెక్రటేరియట్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా.. తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అభ్యర్థులు వాపోతున్నారు. ఏండ్లుగా డైటీషియన్ల పదోన్నతుల ప్రక్రియ పెండింగ్‌లో ఉండగా 2024లో కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఇక డీఎంఈ పరిధిలో బయోకెమిస్ట్, లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు గతేడాది ఉద్యోగోన్నతులు ఇవ్వగా.. డైటీషియన్ల ప్రమోషన్ల ప్రకియ మాత్రం ముందుకు సాగ డం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి డైటీషియన్ల పదోన్నతుల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.