హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గట్టింది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో చితికిపోయే ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి, చెవులు చిల్లులు పడేలా ఊదరగొట్టింది. ఆ తర్వాత ఉలుకుపలుకు లేకుండా పోయింది. బుధవారం చెక్‌పోస్టుల రద్దుపై రవాణాశాఖ కార్యాలయంలో హడావుడిగా మీడియా సమావేశం పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్ల జీవన భృతి అంశమే లేకుండా ముగించేశారు. ఇదే అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగ్గా మాట దాటవేశారు. ‘ఇప్పుడుకాదు.. దాని గురించి తర్వాత మాట్లాడదాం’ అంటూ వెళ్లిపోయారు. రాష్ట్రంలో 5.14 లక్షల ఆటోలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రభుత్వం ఇప్పటికు వరకు రూ.1,500 కోట్లు బాకీ పడినట్టు ఆటో డ్రైవర్లు చెప్తున్నారు.
ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు
నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి రూ.12 వేల జీనవ భృతి ఇస్తామని ఆశలు కల్పించిన ప్రభుత్వం ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ఆటోడ్రైవర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహాలక్ష్మి ఉచితబస్సు ప్రయాణంతో ఆర్థికంగా చితికిపోతున్న ఆటో డ్రైవర్లు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోతూ, బాధలు తట్టుకోలేక బలవంతంగా ఉసురు తీసుకుంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 160 మంది ఆటోడ్రైవర్లు ఈ 22 నెలల కాలంలో చనిపోయినట్టు ఆటో యూనియన్ నేతలు చెప్తున్నారు. ఇచ్చిన దొంగ హామీలకు ఇంతమంది బలైనా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడుతున్నారు. తోటి డ్రైవర్ల ఆత్మహత్యల పాపం ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎంతమంది చనిపోతే ఈ సర్కారుకు కనికరం కలుగుతుందని కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపిస్తున్నారు.
ఏపీలో ఏడాదికి రూ.15వేల భృతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్థికంగా ఇబ్బందులు పడే ఆటో డ్రైవర్ల కోసం ఏడాదికి రూ.15 వేలు చెల్లిస్తున్నది. అక్కడి ప్రభుత్వం ఎన్నికల్లో ఈ అంశంపై ఎలాంటి హామీ ఇవ్వకపోయినా ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టకపోయినా ఆటో డ్రైవర్లను ఆదుకున్నది. దసరా పండుగనాడు మొదటి విడతగా 2.9 లక్షల మంది ఆటోడ్రైవర్లకు రూ.436 కోట్లు విడుదల చేసింది. అందులోంచి ఒక్కో ఆటో డ్రైవర్‌కు ఈ ఏడాదికి గాను రూ.15 వేలు అందజేసింది. జిల్లాలవారీగా లెక్కలు తేల్చి నేరుగా వారిఖాతాల్లోనే డబ్బులు జమ చేసింది. అయితే, తెలంగాణలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని ఊదరగొట్టింది. మ్యానిఫెస్టోలో పెట్టి చివరికి ఆ ఊసే ఎత్తడం మానేసిందని ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అటకెక్కిన ఆటోడ్రైవర్ల కార్పొరేషన్
ఎన్నికల్లో, ఎన్నికలు ముగిసిన తర్వాత తమపై ఎనలేని ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సర్కార్ ఆ తర్వాత తమను పట్టించుకోవడమే మానేసిందని ఆటో డ్రైవర్లు అంటున్నారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ పెట్టి వారిని అందలం ఎకిస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం మానేసిందని మండిపడుతున్నారు. 2023 డిసెంబర్ 9న గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నెల నుంచే తమ అకౌంట్లలో రూ.12 వేలు వేస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్క రూపాయి విదల్చలేదని వాపోతున్నారు.