హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : అవసరమైన యూరియా (Urea) ఇవ్వలేక రైతులను హింసిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt).. ఇప్పుడు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ‘యాప్’ డ్రామాను (App) తెరమీదికి తెచ్చింది. రైతులు రెండేండ్లుగా యూరియా కోసం ఎరువులు దుకాణాల వద్ద రాత్రి పగలు, ఎండా వాన అనే తేడా లేకుండా పడిగాపులు కాస్తున్న సంగతి తెలిసిందే. గంటల తరబడి నిలుచునే ఓపికలేక చెప్పులు, పాస్ పుస్తకాలను క్యూలో పెడుతున్నారు. అయినప్పటికీ యూరియా దొరకకపోవడంతో ఓపిక నశించిన రైతులు అనేక చోట్ల రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. చెప్పుల క్యూల చిత్రాలు, రైతులు ఇబ్బందిపడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు కాంగ్రెస్ సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నారు. యూరియా సరఫరాలో సర్కారు వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా యూరియా కొరత తీర్చేందుకు కృషి చేయాలి. కానీ రేవంత్‌రెడ్డి సర్కారు మాత్రం.. కొరత తీర్చడానికి బదులుగా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం మొదలుపెట్టింది. కొరతను కప్పిపుచ్చుకునేందుకు, క్యూలు కనిపించకుండా చేసేందుకు కొత్త డ్రామాకు తెరలేపింది. ఇందులో భాగంగానే ప్రత్యేక యాప్ ద్వారా యూరియా బుకింగ్ విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నది.
యూరియా బుకింగ్ విధానం అమలు చేయడం, ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ తీసుకురావడం వెనుక సర్కారు పెద్ద కుట్రే చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులంతా ఒకేసారి దుకాణాల వద్దకు రాకుండా, క్యూ ఏర్పడకుండా చేసేందుకు వారిని యాప్ నిలువరిస్తున్నది. ఈ యాప్‌లో బుకింగ్ అయితేనే ఎరువులు పంపిణీ చేస్తారు. దీంతో కొందరు రైతులకు ఎరువులను బుక్ చేయించి వారిని దుకాణాల వద్దకు పంపించి.. మరికొందరు రైతులను బుకింగ్ వద్దే ఉండేలా ప్లాన్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుకింగ్ సమయంలో సాంకేతిక సమస్యలు సృష్టిస్తూ రైతులకు ఎరువులు వెంటనే బుక్ కాకుండా చేసి వారిని దుకాణాల వద్దకు రాకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో దుకాణాల వద్ద రైతులు గుమిగూడరని, అల్లర్లు జరగవనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు సమాచారం. తద్వారా రాష్ట్రంలో యూరియా కొరత లేదనే ప్రచారం చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.
మొన్నటి వానకాలంలో యూరియా కొరత ఏ స్థాయిలో ఏర్పడిందో.. రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. ఈ యాసంగిలో కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు చోట్ల యూరియా కోసం రైతుల క్యూలు మొదలయ్యాయి. ఎలాగూ యూరియాను ఎక్కువగా తీసుకొచ్చి రైతులకు పంపిణీ చేసే పరిస్థితి లేదు. సర్కారుకు రైతుల్లో మరింత చెడ్డపేరు వస్తుందనే ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో నెలకొన్నది. ఈ నేపథ్యంలో కొరతను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ సర్కారు నానా తంటాలు పడుతున్నది. ఈ పాపాన్ని యాప్‌పై, బుకింగ్ విధానంపై నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. బుకింగ్ సమయంలో యాప్‌లో సాంకేతిక సమస్యలు సృష్టిస్తే యూరియా బుక్ కాదు, అప్పుడు వారు ఎరువుల దుకాణాల వద్దకు వెళ్లరు. ఒకవేళ రైతులు ప్రశ్నిస్తే.. యాప్‌లో యూరియా బుక్ కాలేదు కాబట్టి తామేం చేయలేమని సమాధానం ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నారట.
యూరియా నిల్వలు లేకపోతే ‘కొరత’ పేరు వినిపించకుండా చేసేందుకు యాప్ ను అడ్డం పెట్టుకోనున్నట్టు సమాచారం. స్టాక్ లేనప్పుడు యాప్‌లో బుకింగ్స్ కాకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. నిల్వలు ఉన్నంత మేరకే బుకింగ్స్‌కు అనుమతిచ్చి ఆ తర్వా త రైతులకు బుకింగ్ కాకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఈ యాప్ ఎలా పని చేస్తుం దో, దీని సామర్థ్యం ఏమిటనే అంశంపై అధికారులకే అనుమానం ఉన్నది. వర్షా లు పడినప్పుడు, వరి నాట్ల సమయంలో రైతులందరికీ ఒకేసారి యూరియా అవసరం ఉంటుంది. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు, మరో 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరంతా ఒకేసారి బుకింగ్ కోసం యాప్‌లో ఎంటర్ అయితే సర్వర్ పనిచేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని సాకుగా చూపుతూ యూరియా నిల్వలు లేనప్పుడు యాప్‌లో సాంకేతిక సమస్యలు సృష్టిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.