హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణాల సమీకరణలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పులు చేస్తున్నది. అలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని తొలి 6 నెలల్లోనే రూ.45,162 కోట్ల రుణాలు తెచ్చింది. ఇది రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.54,009 కోట్ల వార్షిక రుణ లక్ష్యంలో 82 శాతానికి సమానం. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని తొలి 6 నెలల్లో బీఆర్ఎస్ సర్కారు తీసుకున్న రూ.31,333 అత్యధిక రుణం కంటే 43% ఎక్కువ. చివరికి కొవిడ్ సంక్షోభ సమయంలోనూ బీఆర్ఎస్ ప్రభు త్వం ఇంత భారీగా రుణాలను సమీకరించలేదు. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 6 నెలలు మిగిలి ఉండగానే అప్పుల్లో అన్ని రికార్డులు బద్ధలు కొట్టిన రేవంత్‌రెడ్డి సర్కారు.. ఇప్పటివరకు ఒక్క ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును కూడా చేపట్టలేదు. కనీసం ఒక్క ఇటుకనైనా పేర్చలేదు.
పైపెచ్చు మరింత అప్పు కావాలంటూ రిజర్వు బ్యాంక్‌కు ప్రతిపాదనలు పంపింది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు, అద్భుతమైన సచివాలయం, జిల్లాల కలెక్టరేట్ల లాంటి అత్యంత ప్రతిష్ఠాత్మక నిర్మాణాలు చేపట్టినప్పటికీ రాష్ట్ర అప్పులు మాత్రం అదుపులోనే ఉండేవి. బడ్జెట్ ప్రతిపాదనలకు మించి పెద్దగా అప్పులు చేసిన దాఖలాలే లేవు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు తెలంగాణను అప్పుల ఊబిలో ముంచేస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి మరిన్ని రుణాలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల విలేకరుల సమావేశంలో బాహాటంగానే ప్రకటించారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500, యువతులకు స్కూటీలు, పెండ్లి సమయంలో తులం బంగారం ఇస్తామన్న హామీలను నెరవేర్చకుండా, చెప్పుకోదగ్గ పెద్ద ప్రాజెక్టును కనీసం ఒక్కటైనా చేపట్టకుండా రాష్ట్ర ప్రజలపై రుణభారాన్ని పెంచుతుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
