హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): గ్రామ స్వరాజ్యం గురించి గొప్పలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో విఫలమవుతున్నది. కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు వస్తున్నా, వాటికి సమానంగా రాష్ట్రం తన వాటా కింద ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాం ట్స్ జమచేయకుండా మొండిచేయి చూపుతున్నది. ఫలితంగా పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతున్నది. కేంద్రం నుంచి ఆర్థిక సంఘం ద్వారా అన్ని రాష్ర్టాల స్థానిక సంస్థలకు నిధులు వస్తుంటాయి. అలా వచ్చిన నిధుల్లో 85శాతం పంచాయతీలకు, 10శాతం మండల పరిషత్‌లకు, 5శాతం నిధులు జడ్పీలకు వెచ్చిస్తుంటారు. కేంద్రం ఇచ్చే నిధులకు సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మ్యా చింగ్ గ్రాంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు అన్ని స్థానిక సంస్థల పాలకవర్గాలు ఉన్నందున నిధులు విడుదల ప్రక్రియకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. 2023 ఫిబ్రవరి ఒకటి నుంచి పంచాయతీల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. నాటి నుంచి పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు నిధుల విడుదలపై ప్రతిష్ఠంభన నెలకొన్నది.
15వ ఆర్థిక సంఘం నుంచి 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల కు సంబంధించి తెలంగాణకు మొత్తం సుమారు రూ.3వేల కోట్ల వరకు రావాల్సి ఉన్న ది. రాష్ట్రంలో జిల్లా, మండ ల పరిషత్‌లకు ఎన్నికలు జరుగనందున రూ.450 కోట్లు కోత పడుతుంది. అవి మినహా రావాల్సిన నిక ర నిధులు రూ.2,550 కోట్ల వరకు ఉంటాయి. రాష్ట్ర వాటా కింద ప్రభుత్వం సుమారు రూ.3 వేల కోట్ల వరకు మ్యాచింగ్ గ్రాంట్‌గా ఇవ్వాల్సి ఉన్నది. కానీ, గడిచిన రెండేండ్లలో కేవలం వేతనాల కోసం ఒకసారి రూ.613 కోట్లు, మరోసారి రూ.411 కోట్లు మాత్రమే మంజూరు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మిగిలిన నిధుల ఊసేలేదు. 2025-26 సంబంధిం చి 15వ ఆర్థిక సంఘం నుంచి మంగళవారం టైడ్ గ్రాంట్స్ రూ.371.91కోట్లు, అన్‌టైడ్ గ్రాంట్స్ రూ.247.94 కోట్లు కలిపి మొత్తం రూ. 619.85కోట్లు వచ్చాయి. ఇంకా రెండో విడు త కింద మరో రూ.620 కోట్ల వరకు రావాల్సి ఉన్నది. రాష్ట్రం తన వాటా నిధులను సకాలం లో విడుదల చేస్తేనే స్థానిక సంస్థల కష్టాలు తీరుతాయి. అంతేగాక వేల సంఖ్యలో ఉన్న మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల బకాయిలు కూడా తీరుతాయి. వాటితోపాటు కార్యదర్శులు పంచాయతీల నిర్వహణకు ఖర్చుచేసిన బిల్లులు రూ.90కోట్ల బకాయిలు చెల్లించవచ్చు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచుల చేతుల్లో గ్రామాల అభివృద్ధి కోసం నిధులు ఉంటాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా, రాష్ట్రం మాత్రం తన వాటా నిధులను తొకిపెట్టడంపై గ్రామాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.