గోదావరి బేసిన్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, ఒడిశా, పాండిచ్చేరి ఉన్నాయి. కావేరికి నీళ్లను తరలిస్తే నష్టపోయేది మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలే. అందుకే మోదీ సర్కారు తెలంగాణమినహా మిగిలిన రాష్ర్టాలకు ఇతర ప్రాజెక్టులపై సహకారం అందించి వాటి నోరు మూయిస్తున్నది.
కృష్ణా-కొయిన ఇంట్రా రివర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థికసాయం చేస్తామని కేంద్రం హామీ
కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్-2 అవార్డు అమలు ద్వారా ఆల్మట్టి ఎత్తు, స్టోరేజీ పెంచుకోవడం.. అప్పర్‌భద్ర ప్రాజెక్టు, నావలి రిజర్వాయర్ విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు
రూ.49 వేల కోట్ల విలువైన బోథ్ఘాట్తో పాటు మహానది-ఇంద్రావతి లింకు ప్రాజెక్టుకు అనుమతులు
గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఏపీ రూపొందించిన రూ.80 వేల కోట్ల బనకచర్ల ప్రాజెక్టుకు నిధులు, అనుమతులు
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : రాజకీయంగా, సిద్ధాంతపరంగా.. బీజేపీ-కాంగ్రెస్ వైరుధ్యమున్న రెండు జాతీయ పార్టీలు. మరి..బీజేపీ తమిళనాట రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణకు చారిత్రక అన్యాయం చేసేందుకు ఒడిగడితే కాంగ్రెస్ ఏం చేయాలి? ప్రజలు నమ్మి అధికారమిచ్చినందుకు తెగేసి కొట్లాడాలి. జాతీయ స్థాయిలో గళం వినిపించాలి. కేంద్రం బుల్డోజ్ చేయాలని ప్రయత్నిస్తే దేశ అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టాలి. కానీ కావేరి లింకు పేరిట కేంద్రం తెలంగాణ కండ్లలో పొడుస్తున్నదని తెలుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం పెదవి విప్పడం లేదు. పైగా అసలు వివాదాన్ని లేవనెత్తకుండా బీఆర్ఎస్పై ఆరోపణలతో విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. తెలంగాణను ఎడారి చేసే కుయుక్తులు కొనసాగుతున్నా సీఎం మౌనరాగం ఆలపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ గోదావరి బేసిన్లో ‘విభజన’ విధానాన్ని అమలు చేస్తున్నది. గోదావరి బేసిన్‌తో ఏమాత్రం సంబంధంలేని తమిళనాడుకు జలాలను తన్నుకుపోవడంపై బేసిన్ రాష్ర్టాలన్నీ ఒంటి కాలు మీద లేవాల్సినప్పటికీ మోదీ ప్రభుత్వం ఒక్కో రాష్ర్టాన్ని ఒకో తీరుగా నోరు మూయిస్తున్నారు. ప్రధానంగా బేసిన్ రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తున్నారనేది దేశం ముందు అందరికీ కనిపిస్తున్నది. కాకపోతే తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్నారని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించడం వెనక ఎలాంటి ప్రయోజనం’ ఉన్నదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గోదావరి- కావేరి లింక్ కోసం బీజేపీ సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి ముందుకుపోతున్నది. ఈ అంశం తెరపైకొచ్చి ఏడాదిన్నర కావస్తున్నా రేవంత్‌రెడ్డి సర్కారు కించిత్తు మాట మాట్లాడటం లేదు. పైగా లింక్ ప్రాజెక్టుకు మార్గం సుగమయయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై నీటిపారుదలశాఖ వర్గాలు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. కేంద్రం కావేరి వ్యూహం స్పష్టంగా కనిపిస్తున్నా రాష్ట్ర సర్కారు స్పందన తీరు అనుమానాలకు తావిస్తున్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సింది పోయి అఖిలపక్షాన్ని ఎంపీలకే పరిమితం చేసి, ఇతర పక్షాలు లేకుండా ఢిల్లీకి వెళ్లడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. రేవంత్ సర్కారు మౌనం వల్లే కేంద్రం సులువుగా బేసిన్‌లోని మిగిలిన రాష్ర్టాలను దారికి తెచ్చే ప్రక్రియను దిగ్విజయంగా పూర్తి చేసిందని సీనియర్ ఇంజినీర్ ఒకరు చెప్పారు. అసలు బేసిన్‌తో సంబంధంలేని తమిళనాడుకు నీటిని తరలిస్తున్నందున బేసిన్‌లోని రాష్ర్టాలన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉన్నదని, ఇందుకు గత ట్రిబ్యునళ్లు, అనేక ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఓవైపు గళం వినిపిస్తూనే మరోవైపు బేసిన్‌లోని ఇతర రాష్ర్టాలను కలుపుకొని కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. అదేమీ లేకపోవడంతో బీజేపీ నిరాటంకంగా తన ప్రణాళికను అమలు చేస్తున్నది.
గోదావరి బేసిన్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పాండిచ్చేరి ఉన్నాయి. కావేరికి జలాలు తరలిస్తే ప్రధానంగా నష్టం జరిగేది మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకే. అందుకే మోదీ సర్కారు తెలంగాణ మినహా మిగిలిన రాష్ర్టాలకు ప్రాజెక్టుల విషయంలో పూర్తి సహకారం అందించి ఆయా రాష్ర్టాల నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నది.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ కృష్ణా, గోదావరి బేసిన్లో ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్‌గా, ఇరు రాష్ర్టాల సీఎంలు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చట్టాన్ని తుంగలో తొక్కి జీబీ లింక్ ప్రాజెక్టును ఏపీ దూకుడుగా ముందుకు తీసుకుపోతుండగా, ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం మద్దతు తెలిపింది. తెలంగాణ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండానే ఏపీ పీఎఫ్ఆర్ (పాజెక్టు ఫిజిబులిటీ రిపోర్టు), డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించడం, తొలిదశ పర్యావరణ అనుమతులకు కేంద్ర పర్యావరణశాఖ సూత్రప్రాయ అంగీకారం తెలపడం చకచకా జరిగిపోయింది. నెలాఖరున బనకచర్ల ప్రాజెక్టు టెండర్లు పిలిచేందుకు ఏపీ సన్నాహాలు చేస్తున్నది. అయినా రేవంత్ కిమ్మనడం లేదు! గతంలో సుప్రీంకోర్టు తీర్పుతోనే బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నది. రాయలసీమ లిఫ్ట్ పనులకు బ్రేక్ పడింది. తెలంగాణకు సంబంధించి గౌరవెల్లి, సీతమ్మసాగర్ పనులూ నిలిచిపోయాయి. అలాంటి అవకాశమున్నా జీబీ లింక్‌ను నిలువరించేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు కోర్టును ఆశ్రయించడం లేదు. కనీసం అపెక్స్ కౌన్సిల్లో చర్చకు పెడితే ఇరు రాష్ర్టాల అభిప్రాయాలతో కేంద్రమూ తన అభిప్రాయాన్ని తెలుపాల్సి ఉంటుంది. మినిట్స్‌లో రికార్డవుతాయి. అయినా జీబీ లింక్‌పై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని రేవంత్‌రెడ్డి కనీసం డిమాండ్ చేయడం లేదు. విభజన చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించినా కోర్టును ఆశ్రయించడం లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఇట్లా ఉంటే.. ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తమకేం పట్టనట్టుగా రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తుండటం విస్తుగొలుపుతున్నది. కొన్నిరోజుల కిందట బనకచర్లపై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తుందని, డీపీఆర్‌కు అనుమతే ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. కానీ ఆపై కేంద్రం ఏకంగా అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ టీవోఆర్‌ను ఖరారు చేసింది. పైగా చంద్రబాబు పదేపదే మీడియా ముందుకు వచ్చి బనకచర్లను చేపడుతున్నట్టు అధికారికంగా ప్రకటిస్తున్నారు. అయినా తెలంగాణ బీజేపీ ఎంపీలు మాత్రం నోరు మెదపడం లేదు. గత 11 ఏండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధుల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూనే వస్తున్నది.. అయినా ఏనాడూ బీజేపీ నేతలు మాట్లాడిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఏకంగా 8 ఎంపీ సీట్లిచ్చినా కనీసం ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టునూ తీసుకురాలేదని, ఇక బనకచర్ల ద్వారా కావేరికి తెలంగాణ గోదావరి జలాలను తన్నుకుపోతుంటే ఇక్కడి బీజేపీ ఎంపీలు అడ్డుకుంటారనుకోవడం అత్యాశేనని పెదవి విరుస్తున్నారు.
భవిష్యత్తులోనూ గోదావరి-కావేరి, బనకచర్లకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కేంద్రం, ఏపీ కుట్ర చేస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. బేసిన్‌లోని అన్ని రాష్ర్టాలతో సంబంధం లేకుండా ఏపీ-తెలంగాణ మధ్యే అథారిటీ ఏర్పాటు చేసి.. ఏదో ఒక సాకుతో తమిళనాడును జోడించాలనే ప్రణాళిక సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కృష్ణా బేసిన్లోనూ తెలుగు గంగ ప్రాజెక్టు కింద ఏపీ-తెలంగాణతో పాటు తమిళనాడు కూడా చెన్నై నీటి కోసం భాగస్వామిగా ఉన్నది. ఇట్లనే ఈ అంశాన్ని తెలుగు రాష్ర్టాలకే పరిమితం చేసి అందులో తమిళనాడుకు అధికారిక పాత్ర ఇస్తే పోతిరెడ్డిపాడులా బనకచర్ల కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నోరు కొట్టడం.. తద్వారా తమిళనాడుకు జలాలను తరలించుకుపోవడమనేది ఈ ప్రణాళిక సారాంశంగా ఒక సీనియర్ ఇంజినీర్ విశ్లేషించారు.