సంగారెడ్డి, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నాడు కేసీఆర్ ఏర్పాటుచేసిన దేశంలోని తొలి గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ కాలేజీకి ‘ఎస్టాబ్లిష్మెంట్ జీవో’ను జారీ చేయకుండా గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు. ఈ గిరిజన లా కాలేజీకి ‘బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ గుర్తింపు లభించాలన్నా, వచ్చే ఏడాది గిరిజన విద్యార్థులు లా డిగ్రీ పొందాలన్నా ఎస్టాబ్లిష్మెంట్ జీవో తప్పనిసరి ఉండాలి. ఈ జీవో జారీలో సర్కారు మీనమేషాలు లెక్కపెడుతున్నది.
కాలేజీ మొదటి బ్యాచ్ విద్యార్థుల ఫైనల్ ఇయర్ పరీక్షల ప్రారంభంలోగా ఎస్టాబ్లిష్మెంట్ జీవో ఉండాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గడువు విధించింది. ఆడిటింగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ జీవో తప్పనిసరి అని పట్టుబడుతున్నా రేవంత్‌రెడ్డి సర్కార్‌లో కదలిక రావడం లేదు. ఈ జీవో కోసం కళాశాల ప్రిన్సిపాల్, తెలంగాణ ట్రైబలర్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్సిస్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం) ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం కనిపించడం లేదు. ఈ జీవో ఫైలు నెలల తరబడి సెక్రటరియేట్లో పెండింగ్‌లో మగ్గుతున్నది. దీంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై గిరిజన లా కాలేజీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజనులు అన్నిరంగాల్లో ముందుండాలన్న సంకల్పంతో కేసీఆర్ దేశంలో మొట్టమొదటి గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీని ఏర్పాటుచేశారు. 2021 మార్చిలో సంగారెడ్డిలో గిరిజన బాలుర రెసిడెన్షియల్ లా కాలేజీని అప్పటి వైద్య ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్‌రావు, సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. తొలుత 60 సీట్లు కేటాయించారు. 2020-21లో 32 మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. ప్రస్తుతం కాలేజీలో 147 మంది విద్యార్థులు లా చదవుతున్నారు.
ఫైనలియర్లో 31 మంది విద్యార్థులు ఉన్నారు. వచ్చే ఏడాది గిరిజన లా కాలేజీ నుంచి మొదటి బ్యాచ్ విద్యార్థులు లా పట్టాలతో బయటకు రానున్నారు. ‘ఎస్టాబ్లిష్మెంట్ జీవో’ జారీ చేస్తేనే ఆ విద్యార్థుల పట్టాలకు గుర్తింపు ఉంటుంది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల భవిష్యత్తుకు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సంగారెడ్డి గిరిజన బాలుర రెసిడెన్షియల్ లా కాలేజీకి ఎస్టాబ్లిష్మెంట్ జీవో తప్పనిసరి. ప్రభుత్వం ఇప్పటికైనా జీవో జారీ చేయాలని విద్యార్థు లు, గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎస్టాబ్లిష్మెంట్ జీవో జారీ ఫైల్‌పై ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవాల్సి ఉన్నది. ఈ జీవో ఇవ్వాలని లిఖితపూర్వకంగా కోరాం. జీవో ను త్వరగా తెచ్చుకోవాలని బార్ కౌన్సిల్ ఇండియా సూచిస్తున్నది. ఆడిటింగ్ విభాగం తప్పనిసరి అని పేర్కొన్నది. సొంత భవనం, పూర్తిస్థాయి సిబ్బంది నియామకం, నిధుల విడుదల సాధ్యమవుతుంది.
– నిరీక్షణ్రావు, లా కళాశాల ప్రిన్సిపాల్, సంగారెడ్డి
గిరిజనుల బాగుకోసం నాడు కేసీఆర్ దేశంలోనే తొలి గిరిజన గురకుల లా కాలేజీని ఏర్పాటుచేశారు. న్యాయశాస్త్రం చదవాలన్న గిరిజన విద్యార్థుల కలను కేసీఆర్ నిజం చేశారు. మా భవిష్యత్తు కోసం కేసీఆర్ కళాశాల ఏర్పాటు చేస్తే రేవంత్‌రెడ్డి సర్కార్ ఆ జీవోను జారీ చేయడమే లేదు. దాంతోనే మాపట్టాలకు గుర్తింపు ఉంటుంది.
-ఆకాశ్ నాయక్, ఫైనలియర్ విద్యార్థి
లా ఫైనలియర్ చదువుతున్న మాకు ఎస్టాబ్లిష్మెం ట్ జీవో రాక ఆందోళనగా ఉన్నది. ఆ జీవో ఉంటేనే లా పట్టాకు విలువ, గుర్తిం పు ఉంటుంది. ప్రభుత్వం జీవో జారీలో తాత్సారం చేయడంతో మనోైస్థెర్యం దెబ్బతింటుంది. పూర్తిగా లా చదవడంపై దృష్టిపెట్టాల్సిన ఫైనలియర్ విద్యార్థులం జీవో కోసం ఎదురుచూడాల్సి వస్తుంది.
-లోకాలాల్ రాథోడ్, ఫైనలియర్ విద్యార్థి