వికారాబాద్, ఆగస్టు 19, (నమస్తే తెలంగాణ): అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని గప్పాలు కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దళిత రైతులకు ధోకా చేస్తున్నది. సాక్షాత్తూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు 1.50 లక్షలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. అదే నియోజకవర్గంలోని దళిత రైతులకు మాత్రం మొండిచేయి చూపడంపై సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేము ఓట్లేసి గెలిపించిన నాయకుడికి స్పీకర్ పదవిచ్చి రుణమాఫీ చేసిన ప్రభుత్వం మాకెందుకు అన్యాయం చేస్తున్నదని దళిత రైతులు మండిపడుతున్నారు. పేదలకు కావాల్సిన రుణమాఫీ పెద్దలకే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా మదన్పల్లికి చెందిన బేగరి బాలయ్య నమస్తే తెలంగాణతో తన ఆవేదనను పంచుకున్నారు. గతంలో తనకున్న నాలుగెకరాలు పెట్టి 75వేలు రుణం తీసుకుంటే.. కేసీఆర్ ప్రభుత్వం ఒక దఫాలో మాఫీ చేసిందని గుర్తు చేశాడు. 2023 ఆగస్టులో వికారాబాద్ కెనరా బ్యాంక్లో రూ.1.10 లక్షల రుణాన్ని తీసుకున్నాడు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షలు మాఫీ చేస్తదని చెప్పడంతో నమ్మి ఓటేశాడు. కాంగ్రెస్ రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించగానే తనకు కూడా మాఫీ అయిదని సంబురపడ్డాడు. రెండో విడతలో లక్షన్నర మాఫీ జాబితాలో తన పేరు ఉంటుందని ఆశించాడు. తీరాపేరు మాయం కావడంతో బ్యాంకులు, అధికారులను సంప్రదించాడు. మూడో విడతలో వస్తదని బ్యాంకు అధికారులు చెప్పిన మాటలు మళ్లీ నమ్మాడు. మూడో విడతలోనూ నిరాశే మిగలడంతో మరోసారి వ్యవసాయ అధికారులను, బ్యాంకులను సంప్రదించాడు. దరఖాస్తు పెట్టుకుంటే నాలుగోవిడతలో వస్తదని చెప్పడంతో విసిగిపోయి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేము ఓటేసిన వారికి రుణమాఫీ ఇచ్చి.. మేమేం పాపం చేశామని మండిపడ్డాడు. పేదోడికి న్యాయం చేయనిది.. ఇదేమి ప్రభుత్వం.. ఇదేమి పాలన అంటూ బేగరి బాలయ్య భగ్గుమన్నాడు.