Rythu Bharosa | హైదరాబాద్, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): వ్యవసాయ శాఖ నిబంధనల ప్రకారం వానకాలం పంటల సాగు సీజన్ సోమవారంతో ముగిసింది. మంగళవారం నుంచి యాసంగి (రబీ) సీజన్ ప్రారంభమవుతున్నది. అయినప్పటికీ రైతులకు ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం పంపిణీ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీజన్ ముగిసినా రైతుభరోసా రాకపోవడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఎన్నికలకు ముందు రైతుభరోసాను పెంచి ఇస్తామని హామీలు గుప్పించి ఇప్పుడు ఉన్నది కాస్త ఊడగొడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.
పెంచి ఇస్తామని పోజులు
‘రైతుబంధు కింద కేసీఆర్ ఏటా 10వేలే ఇస్తున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుభరోసా పేరుతో 15వేలు ఇస్తాం. కౌలు రైతులకు కూడా ఎకరాకు 15వేలు ఇస్తాం. రైతు కూలీలకు రూ. 12వేలు ఇస్తాం’ అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు. కానీ రేవంత్రెడ్డి సీఎం అయ్యాక రైతుభరోసా సంగతి దేవుడెరుగు ఉన్న రైతుబంధును కూడా ఇవ్వడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యాసంగి, వానకాలం రెండు సీజన్లు పూర్తయ్యాయి. యాసంగి కోతల సమయంలో పాత పెట్టుబడిసాయం అందించి.. ప్రభుత్వం ఇప్పుడే వచ్చిందని, వానకాలం నుంచి అమ లు చేస్తామని ప్రకటించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ మాట కూడా తప్పిం ది. ఇప్పటి వరకు పాత రైతుబంధు ఇవ్వలేదు… కొత్త రైతుభరోసా ఇవ్వలేదు. దీంతో రైతుల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. చేతగానప్పుడు తప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
కమిటీలతో కాలయాపన
‘గతంలో రైతుబంధు దుర్వినియోగం అయింది. రైతుభరోసాలో సమూల మార్పులు తీసుకొస్తాం. పంట వేసిన భూమికి, రైతుకు మాత్రమే పెట్టుబడి సాయం పంపిణీ చేస్తాం. ఇందుకోసం రైతులు, మేధావులు అభిప్రాయాల సేకరణకు మంత్రులతో కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వగానే అసెంబ్లీలో చర్చించి రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ చేస్తాం.’ ఇది జూలై 2వ తేదీన రైతుభరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు సమయంలో ప్రభుత్వం చేసిన ప్రకటన. ప్రభుత్వం చెప్పిన గడువు దాటి రెండు నెలలు పూర్తయింది. ఇప్పటి వరకు మంత్రుల కమిటీ నివేదిక ఇచ్చింది లేదు… అసెంబ్లీలో చర్చించిందీ లేదు.. రైతులకు రైతుభరోసా పంపిణీ చేసింది లేదు. కమిటీ ఏర్పాటు తర్వాత వారం రోజుల పాటు పలు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి భారీ హడావిడి చేశారు. రైతులను మభ్యపెట్టేందుకు, కాలయాపన చేసేందుకే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు, అభిప్రాయ సేకరణ పేరుతో డ్రామా ఆడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భరోసా లేనట్టే..
వానకాలం సీజన్ పూర్తి కావడంతో రైతుభరోసా పెట్టుబడిసాయం పంపిణీపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కొత్త నిబంధనలు రూపొందించి, సర్వే చేసి, సాగు చేసే భూముల వివరాలు, రైతుల వివరాలు సేకరించి రైతుభరోసా ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదని రైతులే తేల్చిచెబుతున్నారు. జూన్లో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం అక్టోబర్ వచ్చినా ఇవ్వకపోవడంతో ఈ సీజన్ రైతుభరోసాకు ప్రభు త్వం రాం రాం పలికినట్టేననే అభిప్రాయాలను రైతులు వ్యక్తంచేస్తున్నారు.
కేసీఆర్ నిర్విరామంగా
రైతులకు పెట్టుబడి గోసను తీర్చాలనే సంకల్పంతో నాటి సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఎకరానికి ఏటా రూ. 10 వేల పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేశారు. ఈ విధంగా ప్రతి సీజన్లో సుమారు 65-70 లక్షల మంది రైతులకు రూ.7500కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేవారు. ఇలా పదకొండు విడతల్లో ఏకంగా రూ. 73వేల కోట్లను రైతులకు పెట్టుబడి సాయంగా అందించిన ఘనత కేసీఆర్ సర్కారు దక్కించుకున్నది. సుమారు ఐదున్నరేండ్లలో ఏ సీజన్లోనూ రైతులు రైతుబంధు కోసం ఇంతలా ఎదురు చూసే పరిస్థితి రాలేదు. చివరికి కరోనా కాలంలోనూ రైతులకు కేసీఆర్ సర్కారు టంచనుగా పెట్టుబడి సాయాన్ని అందించింది.
రైతుబంధు ఊసే లేదు
కాంగ్రెస్ వచ్చాక రైతుబంధు ఊసే లేదు. వానకాలం పంటల సాగు చేపట్టి నాలుగు నెలలు పూర్తయినా ఒక్క రూపాయి కూడా పడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు డబ్బులు కచ్చితంగా పడ్డాయి. మరి ఇప్పుడు ఎందుకు వేయట్లేదో ప్రభుత్వం చెప్పాలి.
– గోవర్ధన్, కొణిజర్ల, ఖమ్మం జిల్లా
30 వేలు అప్పు తెచ్చిన
కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ.15 వేలు ఇస్తే.. నేను రూ.30 వేలు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. కేసీఆర్ ఉండగా ఏనాడూ అప్పు తెచ్చుకోలేదు. ఇప్పుడు మళ్లీ అప్పు కోసం షావుకారు దగ్గరకు పోవాల్సి వస్తోంది.
– భాస్కర్రావు, ఎం.వెంకటాయపాలెం, ఖమ్మం జిల్లా
రైతులను ఇబ్బంది పెట్టొద్దు..
ప్రజా ప్రభుత్వమ ని చెప్పే సీఎం రేవంత్రెడ్డి రైతులను ఇబ్బందులు పెట్టడం సరికా దు. వానకాలం సీజన్ పూర్తయినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు వేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు వానకాలం మొదట్లోనే రైతుబంధు పడేది.
– బొడ్డు నర్సయ్య, చినబండిరేవు, భద్రాద్రి జిల్లా