కరీంనగర్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ రాజన్నసిరిసిల్ల (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తరువాత నేతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది. చేనేత కార్మికులకు ఇస్తున్న ఒక్కో ఆర్డర్‌ను రద్దు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో షాక్ ఇచ్చింది. సుమారు రూ.200 కోట్ల విలువైన వస్ర్తోత్పత్తికి సంబంధించిన ఆర్డర్‌ను టెస్కోకు ఇవ్వకుండా.. శుక్రవారం ఈ-టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చర్య నేతన్నల ఉపాధికి తీవ్ర విఘాతం కలిగిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామంటూ రెండేండ్ల క్రితం జీవో-1 విడుదల చేసిన ప్రభుత్వమే ఇప్పుడు దానికి తూట్లు పొడుస్తున్నది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి టెసోకు ఇచ్చిన రూ.105 కోట్ల విలువైన యూనిఫామ్ ఆర్డర్‌ను ఇటీవల రద్దు చేయడంతో శుక్రవారం మెజారిటీ సాంచాలు నిలిచిపోయాయి. కార్మికులకు ఉపాధిలేకుండా పోయింది. ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే మరో వారం పది రోజుల్లో వస్ర్తోత్పత్తి పరిశ్రమ కుదేలై.. కార్మికలోకం ఆకలికేకల పాలయ్యే ప్రమాదం కనిపిస్తున్నది.
తాము ఇచ్చిన జీవోకు తామే తూట్లు!
చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, 2024 మార్చి 11న జీవో-1 జారీ చేసిన ప్ర భుత్వం.. నేతన్నలకు నిరంతర ఉపాధి కల్పించడానికి తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) ద్వారా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న ది. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ దవాఖానలు తదితర సంస్థలకు అవసరమైన అన్ని రకాల వస్ర్తాన్ని టెస్కో ద్వారా తీసుకోవాలని ఆ జీవోలో స్పష్టంచేసింది. ఆయా ప్రభుత్వ శాఖలు ఆర్డర్స్ ఇచ్చిన తర్వా త ఒకవేళ టెస్కో సంబంధిత మెటీరియల్ సరఫరా చేయలేకపోయినా, డిమాండ్ మేరకు సరకు అందుబాటులో లేకపోయినా, ఆయా శాఖల నుంచి ఆర్డర్లు అందిన ఒక వారంలోగా మెటీరియల్ అందుబాటులో లేదని టెస్కో నుంచి (నాన్-అవైలబిలిటీ సర్టిఫికెట్) అధికారికంగా సంబంధిత శాఖలు ధ్రువీకరణ పత్రం పొందిన తర్వాత మాత్రమే చేనేత, పవర్లూ మ్ సొసైటీల నుంచి కాకుండా ఇతర ఏజెన్సీల నుంచి సేకరించడానికి అనుమతి ఉంటుందని ఆ జీవోలో పేర్కొన్నది. ఈ నిబంధనలను అన్ని ప్రభుత్వ సంస్థలు పాటించాలని స్పష్టంచేసింది. కానీ, ఇప్పుడు అదే జీవోకు తూట్లు పొడుస్తున్నది. ఏకంగా ఈ-టెండర్లు పిలుస్తూ ప్రైవేట్ సంస్థలకు మేలు చేసేలా చేస్తుంది.
నేతన్నలకు ఉపాధి ఎలా?
స్వరాష్ట్రం సాధించిన తర్వాత నేతన్నల ఉపాధికి కేసీఆర్ హయాంలో పకడ్బందీ ప్రణాళికలు రచించారు. ఎన్నో పథకాలు అమల్లోకి తెచ్చారు. నిరంతర ఉపాధి ద్వారా మాత్రమే నేతన్నల బతుకులు మారుతాయని భావించి, బతుకమ్మ చీరల నుంచి స్కూల్ యూనిఫామ్‌ల వరకు వస్ర్తోత్పత్తి బాధ్యతను టెస్కో ద్వారా చేనేత, మ్యాక్స్ సంఘాలకు అప్పగించారు. ఒక్కో సంఘానికి ఆర్డర్లు ఇచ్చి, వారి నుంచి ఆయా శాఖలకు కావాల్సిన వస్ర్తాలను సేకరించి తద్వారా నిధులు సమకూర్చింది. ఒక్కో కార్మికుడు నెలకు రూ.15వేల వరకు సంపాదించుకునే వెసులుబాటు కల్పించింది. ఫలితంగా నేతన్నలు అత్యధికంగా ఉన్న సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లోని సాంచాలు నిరంతరం నడువడంతో ఆకలి చావులు, ఆత్మహత్యలు దూరమయ్యాయి. కేసీఆర్ సర్కార్‌కు మించి నేతన్నలకు అండగా ఉంటామని ఎన్నికల వాగ్దానం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలున్నాయి. కొత్తవి దేవుడెరుగు.. ఉన్నవాటికి మంగళం పాడుతున్నది. ప్రస్తుతం ఒక్కో శాఖ నుంచి రావాల్సిన వందలాది కోట్ల ఆర్డర్లను రద్దు చేసి ఈ-టెండర్లు పిలిస్తే చేనేత, మ్యాక్స్ సంఘాల పరిధిలో పనిచేసే నేతన్నలకు ఉపాధి ఎలా దొరుకుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
నిలిచిన సాంచాలు.. రోడ్డున పడ్డ కార్మికులు
రూ.105.5 కోట్ల విలువైన ఆర్డర్ల రద్దు విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో శుక్రవారం సిరిసిల్లలోని పలు సాంచాలను నిలిపివేశారు. ఇప్పటికే చేసిన వస్ర్తోత్పత్తిని ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘాలు.. మళ్లీ ఉత్పత్తి చేస్తే నష్టాల పాలవుతామన్న ఉద్దేశంతో సాంచాలను నిలిపివేశాయి. దీంతో చేనేత కార్మికులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రధానంగా సిరిసిల్ల నేతన్నలకు పెనుశాపంగా మారుతున్నాయి. ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే ఆర్డర్లలో దాదాపు 80%పైగా బట్ట ఇక్కడే ఉత్పత్తి అవుతున్నది. సజావుగా సాంచాలు నడిస్తే రోజుకు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది కార్మికులు ఈ సంచాలపై పనిచేస్తారు. అందుకే ఆర్డర్ల రద్దు ప్రభావం సిరిసిల్లపై అత్యధికంగా కనిపిస్తున్నది.
మొన్న
రంజాన్ తోఫా సందర్భంగా రూ.60 కోట్ల విలువైన వస్ర్తోత్పత్తి ఆర్డర్లను ప్రభుత్వం చేనేత, మ్యాక్స్ సంఘాలకు ఇవ్వకుండా మైనారిటీ శాఖ ద్వారా ప్రైవేట్ టెండర్లు పిలిచింది. ఈ విధంగా ఇతరులకు అప్పగించడంతో చేనేత, మ్యాక్స్ సంఘాల పొట్టకొట్టినట్టయ్యింది.
నిన్న
2026-27 సంవత్సరానికి స్కూల్ యూనిఫాంరాలకు సంబంధించి విద్యాశాఖ టెస్కోకు ఇచ్చిన రూ.105.54 కోట్ల విలువైన వస్ర్తోత్పత్తికి ఆర్డర్లను అకస్మాత్తుగా రద్దు చేసి చేనేత, మ్యాక్స్ సంఘాలకు మరో షాకిచ్చింది.
నేడు
విద్యాశాఖ స్కూల్ యూనిఫామ్ ఆర్డర్ల రద్దు నుంచి ఇంకా కోలుకోక ముందే సర్కార్ మరో బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి ఏటా దాదాపు రూ.200 కోట్ల విలువైన స్కూల్ యూనిఫామ్ క్లాత్, కార్పెట్, బెడ్‌షీట్, బ్లాంకెట్, టవల్ వంటివి తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో- ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) నుంచి సేకరించేవారు. ఈసారి కూడా వస్తాయని, టెస్కోతోపాటు చేనేత, మ్యాక్స్ సంఘాలు ఆశించాయి. కానీ, సర్కార్ మాత్రం ఆర్డర్లు ఇవ్వకుండా నేరుగా ఈ-టెండర్లు పిలిచింది. అందుకు సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ శుక్రవారం పేపర్ ప్రకటన జారీ చేసింది.
విద్యాశాఖ ఆర్డర్లను రద్దు చేయడం దుర్మార్గం
స్వయంగా సీఎం వద్దనే ఉన్న విద్యాశాఖ నుంచి చేనేత రంగానికి ఇచ్చిన రూ.105 కోట్ల విలువైన ఆర్డర్లను అకస్మాత్తుగా రద్దు చేయడం దుర్మార్గమని పవర్లూమ్ వరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ విమర్శించారు. చేనేత, పవర్లూమ్ పరిశ్రమపై సర్కార్ కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, కార్మికులకు 365 రోజులు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన సిరిసిల్లలోని సీఐటీయూ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి టెసోకు ఇచ్చి న యూనిఫాం ఆర్డర్‌ను అకస్మాత్తుగా రద్దు చేస్తూ చేనేత శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో చేనేత, పవర్లూమ్ కార్మికుల జీవనోపాధి మీద పెద్దఎత్తున ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడంతో మగ్గాలవారు రూ.50 కోట్ల విలువైన నూలు ఖరీదు చేశారని, ఆర్డర్లు రద్దు చేస్తే వారి పరిస్థితేమిటని ప్రశ్నించారు. టెసోకు విద్యాశాఖ నుంచి యూనిఫామ్ ఆర్డర్లను పునరుద్ధరిస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్డర్లు రద్దు చేయొద్దు.. తయారైన బట్టను తీసుకోవాలి
రెండు షెడ్లు అద్దెకు తీసుకొని కార్ఖానాలు నడుపుతున్నాను. నాకు 58 మరమగ్గాలున్నాయి. అందులో 18 మంది కార్మికులు పనిచేస్తున్నరు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు స్కూల్ యూనిఫామ్, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, ఇతర ఆర్డర్లు వచ్చాయి. సాంచెలు మంచిగ నడిచాయి. కార్మికులకు చేతి నిండా పని దొరికింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక సరిగ్గా ఆర్డర్లు ఇస్తలేదు. మొదట్ల కొన్ని రోజులు సాంచెలు బంద్ పెట్టినం. యూనిఫాం ఆర్డర్లు ఫిబ్రవరిలో ఇచ్చారు. మా సొసైటీకి 15 వేల మీటర్ల బట్ట ఆర్డర్ వచ్చింది. బట్ట పూర్తిగా తయారైంది. ఇక మిల్లుకు పంపాలని అనుకుంటున్నం. ఇంతలో ఆర్డర్లు రద్దు చేస్తున్నట్టు చేనేత, జౌళి శాఖ అధికారులు నోటీసులు పంపించారు. చాలా ఆందోళన పడుతున్నం. – బూర శ్రీనివాస్, సిరిసిల్ల
మమ్మల్ని రోడ్డున పడేయొద్దు
కులవృత్తినే నమ్ముకొని సాంచెలు నడుపుకొంటూ బతుకుతున్నం. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు మంచిగ సాంచెలు నడిచాయి. పని దొరికింది. ఏ రందీ లేకుండా బతికినం. రెండేండ్ల సంది మమ్మల్ని ఆగం చేస్తున్నారు. మా కార్మికులను రోడ్డున పడేయొద్దు. సర్కార్ ఆర్డర్లు ఇయ్యకపోతే మాకు పనేట్లా దొరుకుతది?
– లక్ష్మీనారాయణ, నేత కార్మికుడు, బీవైనగర్