సీఎం రేవంత్ గారూ.. ‘చుంగ్ గై చున్’ వాగు చూడటం కోసం కోట్లు ఖర్చు పెట్టి సియోల్ వరకు వెళ్లడం ఎందుకు?? ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. వాగు పునరుజ్జీవ క్రమం మొత్తం తెలిసిపోతుంది.
Musi Riverfront | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు లండన్‌లోని థేమ్స్ ప్లాన్‌ను అమలు చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం అభాసుపాలైంది. ‘థేమ్స్ యాక్షన్ ప్లాన్’లో కీలకమైన సీవరేజీ ట్రీట్మెంట్ను చేపట్టకుండా మూసీ పరీవాహకంలోని పేదల ఇండ్ల కూల్చివేతలే లక్ష్యంగా ముందుకెళ్లిన సర్కారుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ‘అసలు థేమ్స్ యాక్షన్ ప్లాన్ ఏంటో తెలుసా?’ అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక తన వరుస కథనాలతో సర్కారును నిలదీసింది. దీంతో మూసీ ప్రాజెక్టును సమర్థించుకోవడానికి రేవంత్ బృందం కొత్తగా దక్షిణ కొరియా పర్యటనకు సిద్ధమైంది. ఇప్పటివరకు మూసీ రివర్‌ఫ్రంట్, మూసీ సుందరీకరణ పేరిట ప్రచారం చేసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు నది పునరుజ్జీవం పేరిట కొత్త రాగం అందుకున్నది. ఇందులో భాగంగా ఆదివారం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని చుంగ్ గై చున్ రీస్టోరేషన్ ప్రాజెక్టు పరిశీలనకు హైదరాబాద్ నుంచి 20 మందితో కూడిన బృందం వెళ్లనున్నది. అయితే, మూసీ ప్రాజెక్టుకు, ఎక్కడో సియోల్‌లో ఉన్న చుంగ్ గై చున్ ప్రాజెక్టుకు సంబంధమేంటి? అనే ప్రశ్న ఇప్పుడు అంతటా వినిపిస్తున్నది.
చుంగ్ గై చున్ వాగులో దెబ్బతిన్న ఫ్లైఓవర్ పిల్లర్లు
సియోల్ నగరం మధ్య నుంచి చుంగ్ గై చున్ అనే వాగు ప్రవహిస్తున్నది. ఇది నది కాదు. ఓ పిల్ల వాగు. సియోల్‌లో 13.7 కిలోమీటర్ల మేర ప్రవహించి చివరకు హన్ నదిలో కలుస్తుంది. 20వ శతాబ్దం మొదట్లో ఈ చుంగ్ వాగు వెంబడే ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏండ్లు గడిచాయి. పెరిగిన జనాభాతో పాటే వాగులో వ్యర్థాలు చేరడం ఎక్కువైంది. దీంతో నివాస ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలు వాగులో కలువనీయకుండా అప్పటి ప్రభుత్వం మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించింది. వాణిజ్య కార్యకలాపాలు పెరుగడంతో ఆ ప్రాంతాన్ని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ)గా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వాగుకు ఇరువైపులా వాణిజ్య నిర్మాణాలు ఏర్పాటైనా రద్దీకి తగిన రవాణా వ్యవస్థ ఏర్పాటు కాలేదు. దీంతో 1958లో అప్పటి ప్రభుత్వం పిల్లర్ల సాయంతో వాగు మీద (వాగు పొడవునా) కాంక్రీటు స్లాబ్ నిర్మించింది. దానిపై రహదారులు, ఫ్లైఓవర్లు కట్టింది. రవాణా సదుపాయాలు పెరగడంతో ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందింది. ఫ్లైఓవర్లు, రహదారులకు ఇరువైపులా భారీ భవంతులు వెలిశాయి.
ఐదారు దశాబ్దాల పాటు బాగానే ఉన్నా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వాగు నీటిలో ఏండ్లకేండ్లు నానడంతో ఫ్లైఓవర్ల పిల్లర్లు కుంగాయి. వాటిని తొలగించడం లేదా పునర్నిర్మించక తప్పని పరిస్థితి తలెత్తింది. అన్నివర్గాల అభిప్రాయాలను తీసుకున్న ప్రభుత్వం.. పర్యావరణ వేత్తల సూచలనల మేరకు చుంగ్ గై చున్ పునరుజ్జీవ ప్రాజెక్టు (చుంగ్ గై చున్ రీస్టోరేషన్) చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా సీబీడీకి అనుసంధానంగా నగరంలోని మిగతా ప్రాంతాలకు ఆరు, ఎనిమిది లేన్ల రహదారులు నిర్మించింది. అలా చుంగ్ గై చున్ వాగు మీద ఫ్లైఓవర్లపై ట్రాఫిక్‌ను నియంత్రించి చుట్టూ ఉన్న భవనాలను కూల్చకుండానే ఎంతో జాగ్రత్తగా ఫ్లైఓవర్లు, రహదారులను తొలగించింది. తర్వాత వాగు ఒడ్డున పార్కులు, విద్యుత్తు దీపాలతో సుందరీకరణ పనులు చేపట్టింది. చిన్న వాహనాల కోసం వాగు ఇరువైపులా రోడ్లు నిర్మించింది. అలా 2003లో ప్రారంభమైన చుంగ్ గై చున్ రీస్టోరేషన్ ప్రాజెక్టు 2005లో పూర్తయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టును చూసేందుకే తెలంగాణ నుంచి 20 మందితో కూడిన బృందం సియోల్ వెళ్తున్నది.
మూసీ రివర్‌ఫ్రంట్‌కు ‘థేమ్స్ మాడల్’ను అమలు చేస్తున్నామంటూ ఊదరగొట్టిన రేవంత్ ప్రభుత్వం.. పేదల ఇండ్లను కూల్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్లింది. దీంతో అసలు రేవంత్ ప్రభుత్వం థేమ్స్ మాడల్‌ను అమలు చేయట్లేదని అందరికీ అర్థమైంది. ఈ క్రమంలోనే రైతు రుణమాఫీ, రైతు భరోసా హైడ్రా కూల్చివేతలు, గ్రూప్స్ అభ్యర్థుల అందోళనలు, రాష్ట్ర అప్పులు, నల్లమలలో రాడార్ స్టేషన్ ఏర్పాటు ఇలా ప్రభుత్వంపై అన్నివర్గాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత మొదలైంది. దీంతో ఈ సమస్యల నుంచి దృష్టిమళ్లించేందుకే రేవంత్ బృందం సియోల్ పర్యటనను తెరమీదకు తెచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. మొన్నటి వరకు మూసీ సుందరీకరణ, మూసీ అభివృద్ధి, మూసీ రివర్‌ఫ్రంట్ అని పేర్కొన్న సీఎం రేవంత్.. గురువారం ప్రెస్మీట్లో మూసీ పునరుజ్జీవం అని సంబోధించడం గమనార్హం. ఎందుకంటే, సియోల్‌లోని చుంగ్ గై చున్ వాగు మీద చేపట్టింది పునరుజ్జీవ (రీస్టోరేషన్)ప్రాజెక్టే కాబట్టి!
సియోల్ నగరం వెలుస్తున్న సమయంలోనే చుంగ్ గై చున్ వాగులో వ్యర్థాలు పెరగడం మొదలైంది. దీంతో అక్కడి ప్రభుత్వం సీవరేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి చుంగ్ వాగు మీదనే ఫ్లైఓవర్లు నిర్మించింది. వాగును రక్షించాం అనుకున్నది. ఫ్లైఓవర్ల పునాదులు దెబ్బతినడంతో మళ్లీ వాగు రీస్టోరేషన్ ప్రాజెక్టు పేరిట వాటిని తొలగించింది. దీన్నిబట్టి చూస్తే చుంగ్ గై చున్ రీస్టోరేషన్ ప్రాజెక్టు పూర్తిగా విజయవంతమైనట్టు చెప్పడానికి లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
180 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తున్న మూసీ.. 20 మీటర్ల వెడల్పుతో చుంగ్ గై వాగు
మూసీ ప్రాజెక్టు కోసం సియోల్‌లోని చుంగ్ గై చున్ రీస్టోరేషన్ ప్రాజెక్టును రేవంత్ బృందం ఎందుకు పరిశీలిస్తున్నదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూసీ ఒక నది. దీని పొడవు 250 కిలోమీటర్లు. అందులో హైదరాబాద్ నగరంలో ప్రవహిస్తున్న 55 కిలోమీటర్ల మేర పొడవున్న నదికి ఇరువైపులా అభివృద్ధి పనులు చేపట్టాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నది. 1908లో మూసీకి వచ్చిన వరదల నేపథ్యంలో 11-20 అడుగుల మేర వరద అఫ్జల్‌గంజ్ ప్రాంతాన్ని ముంచెత్తినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 180 మీటర్ల వెడల్పుతో ప్రవహించే మూసీ నదిలో ఒక్కరోజులోనే 4,25,000 క్యూసెక్కుల ప్రవాహం కూడా వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి. సియోల్‌లోని చుంగ్ గై చున్ ఓ పిల్ల వాగు. వెడల్పు సగటున 20 మీటర్లుగా ఉన్నది. నీటిమట్టం మూడడుగుల కంటే తక్కువ. ఐదారేండ్ల పిల్లలు కూడా ఈ వాగులో దిగి ఆడుకుంటారు. చుంగ్ గై చున్‌కు వరదలు వచ్చిన చరిత్ర అసలే లేదు. దీన్నిబట్టి.. ఏ విధంగా చుంగ్ గై చున్ రీస్టోరేషన్ ప్రాజెక్టును మూసీ విషయంలో అన్వయిస్తారన్న సందేహాలు కలుగుతున్నాయి.
20వ శతాబ్దం తొలినాళ్లలో చుంగ్ గై చున్ వాగు పరిసరాలు
సియోల్ నగరం వెలుస్తున్న సమయంలోనే చుంగ్ గై చున్ వాగులో వ్యర్థాల కట్టడికి అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. సీవరేజీ వ్యవస్థ ఏర్పాటు చేసింది. రవాణా సదుపాయం కల్పించడంలో భాగంగా మొదట వాగుపైనే ఫ్లైఓవర్లు నిర్మించి తర్వాత రీస్టోరేషన్‌లో భాగంగా వాటిని తొలగించింది. శతాబ్దాల కిందటే మూసీకి ఇరువైపులా నివాసాలు ఏర్పడ్డాయి. 450 ఏండ్ల తర్వాత ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం మూసీ పునర్జీవం పేరిట ప్రాజెక్టు చేపడుతున్నది. సియోల్ నగరం ఏర్పడ్డప్పుడే అక్కడి ప్రభుత్వం ప్రాజెక్టు చేపట్టగా, ఇక్కడ మాత్రం 450 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా మూసీ ప్రాజెక్టు చేపడుతున్నది.
పక్కనున్న భవనాలు కూల్చకుండానే చుంగ్ గై వాగు పునరుజ్జీవ ప్రక్రియ
చుంగ్ గై చున్ వాగు రీస్టోరేషన్ ప్రాజెక్టులో ఎక్కడా ఒక్క నిర్మాణాన్ని కూడా కూల్చలేదు. పైగా వాగు సుందరీకరణ సమయంలో వాణిజ్య కార్యకలాపాలకు అడ్డంకులు ఏర్పడుతున్నట్టు గమనించిన అక్కడి సర్కారు.. వ్యాపారులకు పన్నులను తగ్గించింది. పార్కింగ్ సదుపాయాలు కల్పించింది. వాణిజ్య కార్యకలాపాల పనిగంటలను పెంచింది. మూసీ ప్రాజెక్టు ప్రారంభం కాకముందే ఇక్కడ రేవంత్ ప్రభుత్వం ఇండ్లు కూల్చేస్తున్నది. బాధితులకు తగిన పరిహారం కూడా ఇవ్వడంలేదన్న విమర్శలూ ఉన్నాయి.
చుంగ్ గై చున్ వాగులో వ్యర్థాలు కలువకుండా ముందుగానే అధికారులు పారిశుద్ధ్య వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఫ్లైఓవర్ల నిర్మాణం తర్వాత కొంత మొత్తం వ్యర్థాలు వాగులో చేరినా, ముందుగా సీవరేజీ ట్యాంకులు ఏర్పాటు చేసిన అధికారులు నీటిని శుద్ధి చేశారు. ఆ తర్వాతే రీస్టోరేషన్ ప్రాజెక్టు చేపట్టారు. మూసీ విషయంలో ముందుగా సీవరేజీ ట్రీట్మెంట్ చర్యలు చేపట్టకుండానే ఇండ్లు కూల్చేస్తుండటం గమనార్హం. మూసీ పరీవాహకం సుందరంగా కనిపిస్తుందో? లేదో? గాని, నదిలో మురుగు మాత్రం అలాగే ఉండి దుర్గందం వెదజల్లడం ఖాయమని ఢిల్లీకి చెందిన ఓ పర్యావరణ నిపుణుడు పేర్కొన్నారు.