హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలకు మందులు సరఫరా చేసిన ఏజెన్సీలకు బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. ఇప్పటివరకు రూ.300 కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టింది. ఇందులో మందులకు సంబంధించి రూ.170 కోట్లు, సర్జికల్ రూ.130 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. బకాయిలపై ఆరోగ్యశాఖ మంత్రి హెల్త్ సెక్రటరీకి లేఖలు రాసినా.. స్పందన లేదని మెడికల్ ఏజెన్సీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. బకాయిల జాప్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నా యి. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మందు లు, సర్జికల్స్ సైప్లె చేశామని ప్రభుత్వ తీరుతో మనోవేదనకు గురవుతున్నామని పేర్కొంటున్నాయి. పేదల వైద్యానికి ఆటంకం కలగవద్దని ఇన్ని రోజులు మందులు, సర్జికల్స్ సరఫరా చేశామని, ఇక మందుల సరఫరా చేయలేమని ప్రభుత్వానికి తేల్చిచెప్పాయి. మందులకు ప్రతి మూడు నెలలకు రూ.125 కోట్ల చొప్పున ఏడాదికి రూ.500 కోట్లు, సర్జికల్‌కు ప్రతి మూడు నెలలకు 46.5కోట్లు చొప్పున రూ.185 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా.. నిధుల విడుదలలో జాప్యం నెలకొన్నదని స్పష్టంచేశాయి.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సైప్లె చైన్‌పై తీవ్ర ప్రభావం పడిందని మెడికల్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామంతో మందులు, సర్జికల్స్ తయారీ రంగంపై ప్రభా వం చూపినట్టు వివరించాయి. దీనికితోడు వర్కర్ల కొరత మందుల తయారీకి పెనుభారంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశాయి. ఇప్పటికే పలు ఏజెన్సీలు రేట్లు పెరిగిన కారణంగా సరఫరా చేసేది లేదని ప్రభుత్వానికి లె టర్లు పంపినట్టు తెలిపాయి. ఇదిలా ఉండగా, మందులకు సంబంధించి రూ.160 కోట్లకు బడ్జెట్ ఉన్నంత వరకు బిల్లులు అప్లోడ్ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మంగళవారం తో ముగియడంతో నిధులు ల్యాప్స్ అవుతాయని, దీంతో బకాయిలను ప్రభుత్వం చెల్లించాలంటే మరో నాలుగు నెలల సమయం పడుతుందని మెడికల్ ఏజెన్సీలు ఆవేదన వ్యక్తంచేశాయి. ఈ పరిస్థితుల్లో ఏజెన్సీలు మందులు, సర్జికల్స్ సరఫరా నిలిపివేస్తే ప్రజారోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదని, ప్రభుత్వం వెంటనే తమ పెండింగ్ బకాయిలు చెల్లించాలని మెడికల్ ఏజెన్సీల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.