హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా నిర్వహిస్తే భయమెందుకని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యం లో నల్లగొండలో రైతు ధర్నాను అడ్డుకోవడం రాజకీయకక్ష అని విమర్శించారు.
రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామని ఎగ్గొట్టిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ధర్నాకు అనుమతి నిరాకరించారని ధ్వజమెత్తారు. నల్లగొండ ధర్నాకు కేటీఆర్ వస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారనే అక్కసుతోనే అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇటీవల షాబాద్‌లో నిర్వహించిన సభకు రైతులు వేలాదిగా తరలివచ్చారని చెప్పారు. నల్లగొండకు అంతకుమించి తరలివస్తారని పాలకులకు భయం పట్టుకున్నదని తెలిపారు. కోర్టు అనుమతితో నల్లగొండలో రైతు ధర్నా నిర్వహిస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కిశోర్‌గౌడ్, పల్లె రవి తదితరులు పాల్గొన్నారు.