SC Gurukul Society | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనేక వివాదాలకు చిరునామాగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిలుస్తున్నది. అందుకు 1274 జీవో అమలే నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఒకసారి జీవోను అటకెక్కించి, మరోసారి ఆ జీవోనే అమలు చేస్తుండటంతో గురుకులంలో పూర్తిగా గందరగోళం నెలకొన్నది. ఎస్సీ గురుకుల సొసైటీలో 30 మహిళా డిగ్రీ కాలేజీలు, 238 బాలురు, బాలికల పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. బాలికల గురుకులాల్లో మహిళా సిబ్బందిని, సరిపడా సిబ్బంది లేకుంటే 50ఏండ్లు నిండిన మేల్ స్టాఫ్‌ను నియమించొచ్చు. బాలుర గురుకులాల్లో మేల్ స్టాఫ్‌తోపాటు 50ఏండ్లు నిండిన ఫిమేల్ స్టాఫ్కూడా పని చేయొచ్చు. ఇంటిరీయల్ ప్రాంతాల్లో 2 ఏండ్లు పనిచేయాలని షరతులు విధిస్తూ జీవో 1274ను జారీ చేశారు. ఆ జీవోను ఇప్పటివరకూ పాటిస్తూ వస్తున్నారు. అన్ని సొసైటీలు అమలు చేస్తున్నాయి. కానీ ఎస్సీ గురుకుల సొసైటీ మాత్రం ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్నది.
నాడు జీవోను తుంగలో తొక్కి ప్రమోషన్లు
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుడు ప్రమోషన్లు, బదిలీలను నిర్వహించింది. ఈ క్రమంలో ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు జీవో 1274 నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు. జీవో 1274 ప్రకారం బాలికల గురుకులాల్లో పూర్తిగా మహిళా ఉద్యోగులే ఉండాలని, బాలుర గురుకులాల్లో ఎవరైనా ఉండవచ్చు. జనరల్ సూల్స్కు సంబంధించిన నియామకానికి, గర్ల్స్ స్కూల్స్‌కు సంబంధించిన నియామకానికి వేర్వేరుగా రోస్టర్ పాయింట్లను రూపొందించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలని స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దాని ప్రకారమే 5 గురుకుల సొసైటీలు నియామకం చేపడుతున్నాయి. కానీ ఎస్సీ సొసైటీ ఆ రూల్స్‌ను తుంగలో తొక్కింది. ఇష్టారాజ్యంగా ప్రమోషన్లు, బదిలీలు నిర్వహించింది. ఈ నిర్ణయంతో ఫలితంగా ప్రస్తుతం ప్రతీ బాలుర పాఠశాలలోనూ 50శాతం ఫీమెల్ స్టాఫ్ ఉన్నారని యూనియన్ నేతలు చెప్తున్నారు.
ఇంటీరియల్ ప్రాంతాల్లోని బాలికల పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఖాళీలు అధికంగా ఉన్నాయని, కొన్ని చోట్ల నలుగురు, ఐదుగురు రెగ్యులర్ ఉద్యోగులు తప్ప మిగతా వారు మొత్తం పార్ట్‌టైం ఉద్యోగులేనని వెల్లడించారు. బాలికల పాఠశాలల్లోని ప్రిన్సిపాల్స్ చాలా వరకు ఇన్చార్జీలేనని, అనుభవం లేని టీజీటీ, పీజీటీలే ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని వివరిస్తున్నారు. ఉమెన్స్ డిగ్రీ కళాశాలల్లో సుమారు 15 మంది మేల్ స్టాఫ్ పనిచేస్తున్నారని, వారిలో నలుగురు ప్రిన్సిపాల్స్, ఒకరు పీడీ, 11 మంది లెక్చరర్లు ఉన్నారని తెలిపారు. జీవో 1274ను తుంగలో తొక్కి మేల్ స్టాఫ్‌కు ఇచ్చారు. అదీగాక ఉదయం 5గంటల నుంచి రాత్రి భోజనం అయ్యేవరకూ ఉండాల్సిన పీడీని కూడా బాలికల డిగ్రీ కాలేజీలో మేల్ క్యాండిడేట్‌ను ఇచ్చారంటే సొసైటీ ఏమేరకు జీవోను అమలు చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. ఉమెన్స్ డిగ్రీ కాలేజీ అని తెలిసి కూడా 11 మంది జూనియర్ లెక్చరర్లకు డిగ్రీ లెక్చరర్లకు ప్రమోషన్లనూ సొసైటీ కల్పించిందని, నాడు సైతం సొసైటీకి చెందిన గురుకుల యూనియన్లు తీవ్రంగా మండిపడ్డాయి. సొసైటీ జీవోను 1274ను తుంగలో తొక్కడంతో అనేక మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు.
అడ్డదిడ్డంగా అమలుకు హడావుడి
గతంలో జీవోను పాతరేసిన సొసైటీ ఉన్నతాధికారులు మళ్లీ అదే జీవోను హడావుడిగా అమలు చేసేందుకు పూనుకున్నారు. జీవో 1274ను అనుసరించి బాలికల గురుకులాల్లో టీచింగ్, నాన్టీచింగ్తోపాటు అన్ని క్యాటగిరీల్లో మహిళలనే నియమించాలని ఎస్సీ గురుకుల సొసైటీ నిర్ణయించింది. సొసైటీ సెక్రటరీ వర్షిణి ఈ ఏడాది మార్చి 27న సర్క్యులర్ జారీ చేశారు. మల్టీజోనల్, జోనల్ ఆఫీసర్లు, కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్స్ ఆ నిబంధనలను అమలు చేయాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సైతం హెచ్చరించారు. ఇక సర్క్యులర్ సై తం అసమగ్రంగానే ఉన్నదని గురుకుల టీచర్లు ఆరోపిస్తున్నారు. అనుభవజ్ఞులు, మహిళా సి బ్బంది అందుబాటులో లేని సందర్భంలో 50 ఏండ్లు నిండిన పురుష అభ్యర్థులకు అవకాశం కల్పించాలనే నిబంధన ఉంది. కానీ నిబంధన ను పక్కనపెట్టారు. బాలికల కాలేజీల్లో మహిళా సిబ్బందిని నియమించగా, ఖాళీగా ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ స్థానాల్లో 50ఏండ్ల వయస్సు కంటే తక్కువ ఉన్న పురుష అభ్యర్థులను(పార్ట్టైమర్లు) నియమించడంపై గురుకుల టీచర్లు మండిపడుతున్నారు. జీవో 1274ను అడ్డదిడ్డంగా అమలు చేస్తున్నారని, నాన్‌టీచింగ్ సి బ్బందిని, డిగ్రీ కాలేజీల్లోని మేల్ స్టాఫ్‌ను మినహాయిస్తున్నారని గురుకుల సిబ్బంది వివరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జీవో అమలుపై దృష్టిసారించాలని కోరుతున్నారు.
నిషేధమున్నా దొడ్డిదారిన బదిలీలు
బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం నిరుడు జూలైలో ఎత్తివేస్తూ జీవో80ను జారీ చేసింది. ఒకే స్టేషన్లో 4ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్న అన్ని ప్రభుత్వశాఖల్లోని అధికారులను బదిలీ చేయాలని, ఆ ప్రక్రియను ఆగస్టు 20వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది. అటు తర్వాత బదిలీలపై మళ్లీ నిషేధాన్ని విధించింది. అనంతరం 317 జీవోకు సంబంధించి స్పౌజ్, మ్యూచువల్, మెడికల్ కేటగిరీల్లో ఇప్పటివరకు బదిలీలకు ఫిబ్రవరి 28వ తేదీవరకు గడువు విధించింది. ప్రస్తుతం దానిపైనా నిషేధం విధించింది. బదిలీలపై ప్రభుత్వం నిషేధం కొనసాగుతున్నా దొడ్డిదారిన ఎస్సీ గురుకుల సొసైటీ మాత్రం తాజాగా జీవో 1274అమలు పేరిట బదిలీలకు తెరలేపడం గమనార్హం. జీవో 1274 అమలుకు సంబంధించి కేవలం ఒకేఒక సర్క్యులర్‌ను సొసైటీ జారీ చేసింది తప్ప ఇతరత్రా అంశాలకు ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులను జారీ చేయలేదు. పూర్తిగా జోనల్, మల్టీజోనల్ అధికారులకు ఎప్పటికప్పుడు మౌఖిక ఆదేశాలను జారీ చేస్తూ బదిలీల ప్రక్రియను నిర్వహిస్తున్నది. ఇప్పటికే పలువురికి బదిలీ ఆర్డర్లను కూడా సొసైటీ జారీ చేసింది. రెండురోజుల్లో మిగతా వారందరినీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. హైకోర్టుకు సెలవులను ప్రకటించిన మరునాడే సొసైటీ ఈ బదిలీలను చేపట్టడం కొసమెరుపు.
బదిలీలను ఆపకుంటే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం
సొసైటీ సెక్రటరీ, ఉన్నతాధికారుల తీరుపై గురుకుల ఉపాధ్యాయులు, యూనియన్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో 317కు సంబంధించి స్పౌజ్, మెడికల్ బదిలీల సమయంలో తాను 5 ప్రాంతాలను ఆప్షన్ పెట్టుకున్నానని, అందులో ఒక కోఎడ్యుకేషన్ గురుకులం మినహా మిగతావన్నీ బాలుర గురుకులాలేనని ఓ ఉపాధ్యాయుడు వివరించాడు. కానీ నాడు సొసైటీ ఉన్నతాధికారులే బాలురు గురుకులంలో కాకుండా, కో ఎడ్యుకేషన్ గురుకులానికి బదిలీ చేశారని తెలిపారు. మళ్లీ 1274జీవో అమలు పేరిట మళ్లీ బదిలీ ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నారని, లేదంటే తమకు నచ్చిన చోటుకు బదిలీ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని వివరించారు. 1274జీవోను పక్కనపెట్టి నాడు సొసైటీ ఉన్నతాధికారులే మహిళా గురుకులాల్లో పోస్టింగ్ ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ బలవంతంగా బదిలీ చేస్తున్నారని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. సొసైటీ తీరు వల్ల సమీప గురుకులాలను కోల్పోయామని వాపోతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ, రాత్రికిరాత్రే ఉత్తర్వులు జారీ చేస్తూ జోనల్, మల్టీజోనల్, ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గురుకుల యూనియన్ల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని, లేదంటే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.