హైదరాబాద్, మే 16(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ కుట్రలో మక్క రైతులు సమిధలుగా మారుతున్నారా? రాష్ట్రం మొత్తం ఉత్పత్తిలో కేవలం 34% పంటనే కొనాలని నిర్ణయించిందా? అందుకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కొనుగోలులో ఇబ్బందులు సృష్టిస్తున్నదా? జిల్లాల వారీగా కొనుగోలు టార్గెట్లు పెట్టిందా? అంతకు మించి కొనుగోలు చేయొద్దని జిల్లా మార్క్‌ఫెడ్ అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీ చేసిందా? అంటే అవుననే సమాధానాలే వినవస్తున్నాయి. మక్కల కొనుగోలులో భారీగా కోత పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని దీన్నిబట్టే తెలుస్తున్నది. ఇందుకు అవసరమైన నిధులనే మంజూరు చేసిందని సమచారం. మార్కెట్లో ఎంత పంట పోటెత్తినా సరే.. ముందుగా నిర్ణయించిన మేరకే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీలైతే టార్గెట్‌కు తక్కువ కొనుగోలు చేసేందుకు సైతం ప్రయత్నాలు చేయాలని మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది. ఈ ముందస్తు కుట్రలో భాగంగానే కొనుగోలులో సవాలక్ష కొర్రీలు పెడుతూ సమస్యలు సృష్టిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 16.25 లక్షల ఎకరాల్లో మక్కజొన్న పంట సాగైంది. ఎకరానికి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కానీ ప్రభుత్వం 26.57 క్వింటాళ్ల దిగుబడిని నిర్ధారించింది. ఈ మేరకు మొత్తం 43.15 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. వాస్తవానికి ఈ మొత్తం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కానీ ఇందులో 21.57 లక్షల టన్నులే కొనాల్సి వస్తుందని అంచనా వేసింది. ఆ మేరకు కొనుగోలు చేసినా రైతులకు ఇబ్బందుల్లేకుండా ఉండేది. కానీ, ఆ అంచనాలోనూ మరింత కోత పెట్టింది. చివరికి 14.88 లక్షల టన్నులే కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. అంటే మొత్తం ఉత్పత్తిలో 28.27 లక్షల టన్నుల పంటను కొనుగోలు చేయొద్దని ముందే నిర్ణయించింది. కొనుగోలుకు సర్కారే నిరాకరిస్తే మిగతా పంటను రైతులు ఎక్కడ, ఎవరికి అమ్ముకోవాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 8.56 లక్షల టన్నులు మాత్రమే సర్కార్ కొనుగోలు చేసింది.
మక్కలు కోనుగోలు చేస్తే ఖజానాపై భారీగా ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వ పెద్దలు ముందుగానే భావించారు. అందుకే కొనుగోళ్లలోనే కోత పెట్టిన సర్కార్.. ఆ మేరకు నిధుల్లోనూ కోతపెట్టింది. వాస్తవానికి 43.15 లక్షల టన్నుల మక్కలు కొనుగోలు చేస్తే రూ.10 వేల కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం 14.88 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3,571 కోట్ల రుణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇవైనా సకాలంలో వచ్చాయా అంటే అదీ లేదు. అందులోనూ ప్రభుత్వం ఇతర అప్పులతో లంకె పెట్టింది. మార్క్‌ఫెడ్ ఓ బ్యాంకుకు రూ.వెయ్యి కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఈ వారంలో చెల్లించని పక్షంలో ఎన్పీ అయ్యే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో మక్కలకు కేటాయించిన రుణం నుంచే రూ.1,000 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. మరో బ్యాంకు మరో రూ.వెయ్యి కోట్లు రుణం చెల్లించాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇలా మక్కలకు కేటాయించిన రూ.3,571 కోట్లలో రూ.2వేల కోట్లు రుణాల చెల్లింపులకే పోతున్నట్టు తెలిసింది. ఇక మక్కల కొనుగోలుకు మిగిలింది కేవలం రూ.1,571 కోట్లు మాత్రమే.
మక్కల కొనుగోలులో కోత పెట్టిన సర్కార్.. అందుకు అనుగుణంగా జిల్లాల వారీగా టార్గెట్ పెట్టినట్టు తెలిసింది. ఆ టార్గెట్‌కు అనుగుణంగానే మక్కలు కొనాలని.. అంతకుమించి కొనుగోలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, రైతులు ఆందోళనలు చేసినా పట్టించుకోవద్దని అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. టార్గెట్‌కు మించి కొనుగోలు చేస్తే చర్యలు తప్పవంటూ జిల్లా మార్క్‌ఫెడ్ అధికారులను హెచ్చరించడంతో పాటు మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది.
కొనుగోలులో సర్కార్ కోతపెట్టడంతో మక్కలు కొనాలంటూ రైతులు నెలరోజులుగా మార్కెట్ యార్డుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వంపై విసుగెత్తి రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఓ పథకం ప్రకారమే ముందుకు వెళ్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోలులో కోత పెట్టేందుకు సవాలక్ష సమస్యలు సృష్టిస్తున్నదనే విమర్శలున్నాయి. గన్నీ సంచులు సమకూర్చకుండా, లారీలను పంపకుండా, సకాలంలో కాంటా పెట్టకుండా, కాంటా పెట్టిన మక్కలను గోదాములకు తరలించకుండా, అవసరమైన స్టోరేజీ కల్పించకుండా ఇలా అనేక సమస్యలు సృష్టిస్తున్నదనే విమర్శలున్నాయి. దీంతో సర్కార్ కుట్రలు ఫలించి, ఇప్పటివరకు కేవలం 8.56 లక్షల టన్నుల మక్కలనే కొనుగోలు చేసింది. ఈ నెలాఖరు వరకు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ మేరకు సర్కార్ ముందుగా నిర్ణయించుకున్న 14 లక్షల వరకు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. రైతుల ఇబ్బందులు, కష్టాలను పట్టించుకోకుండా కేవలం ఆర్థికభారాన్ని తప్పించుకొనేందుకు ప్రభుత్వం కుట్రలతో రైతులను మోసం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
