బనకచర్ల కోసం మన నీటివాటాను బలిపెడుతున్నది బాబు-రేవంత్ ద్వయం. పాలమూరును పణంగా పెట్టి, మన ప్రాజెక్టులను పడావుగా పెట్టి బనకచర్లకు దస్కత్లు ఒత్తబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బాబు సర్కార్ అడుగులకు మడుగులు ఒత్తబోతున్నది. బనకచర్లకు ఆమోదం తెలుపుతూ తెలంగాణ గొంతుకోసేందుకు సిద్ధమవుతున్నది. సెప్టెంబర్ మొదటివారంలో ఏపీతో ఎంవోయూకు ఏర్పాట్లు చేస్తున్నది. మన నీటిహక్కుల్ని బలిపెట్టే కుతంత్రాలకు మధ్యవర్తి కేంద్రమే!
బనకచర్లపై రేవంత్ సర్కార్ వైఖరి ఆదినుంచీ అనుమానాస్పదంగానే ఉన్నది. రోజుకో మాట.. పూటకో డ్రామా.. డైవర్షన్ డైలాగులు.. భేటీల మాటున రహస్య మంతనాలు.. తెలంగాణ గమనిస్తూనే ఉన్నది. సీఎం సొంతగడ్డపై పాలమూరును పూర్తి చేయలేకపోతున్న రేవంత్ ప్రభుత్వం.. ఏపీ ప్రభుత్వం చెప్తున్న ప్రతి మాటకూ తలూపుతున్నది. ‘ఉభయ ప్రయోజనం’ ముసుగులో ఏపీ నీటిదోపిడీకి అభయ మిస్తున్నది. బనకచర్ల, నల్లమలసాగర్, ముచ్చుమర్రి, వెలిగొండ.. ఒక్కటొక్కటిగా జలఖడ్గాలు దిగబోతున్నాయి. కేసీఆర్ పలుమార్లు హెచ్చరించినట్టు.. ‘కత్తి పరాయి వాడిదే కానీ..పొడిచే చెయ్యి’ మనోడిదే! ఆ ‘చెయ్యి’ తెలంగాణ నోట్లో మట్టికొడుతున్నది. ఆ చెయ్యి.. మన ఎవుసం కూలగొట్టి, పరాయి పల్లకీ మోస్తున్నది!
హైదరాబాద్, ఆగస్టు25 (నమస్తే తెలంగాణ): గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు ఏపీ సర్కార్ చేపట్టిన పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టుకు రేవంత్‌రెడ్డి సర్కార్ ఆమోదం తెలిపేందుకే సిద్ధమైంది. గురుదక్షిణ కోసం పాలమూరు ప్రాజెక్టును పణంగా పెట్టేందుకే పూనుకున్నది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్ణయాలు జరిగిపోయాయి. ఒప్పంద దస్ర్తాలు సైతం సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ తొలివారంలోనే ఏపీతో ఒప్పందానికి ముహూర్తం సైతం ఖరారైనట్టు విశ్వసనీయం సమాచారం.
‘అడ్డంకులన్నీ అధిగమించి లక్ష కోట్ల ప్రాజెక్టును అతిత్వరలో ప్రారంభిస్తాం’ అని తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సైతం అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఏపీ ప్రభుత్వం రూ.81వేల కోట్లతో పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టును గతంలోనే ప్రతిపాదించింది. పోలవరం కుడి కాలువ, తాడిపూడి కాలువల సామర్థ్యాన్ని పెంచి 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టా, ప్రకాశం బరాజ్‌కు తరలిస్తుంది.
అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు అటు నుంచి పల్నాడు ప్రాంతానికి సాగు, తాగునీరు, ఆపై బనకచర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్ దాకా తరలించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఏపీ సర్కార్ చేసిన ఆ ప్రతిపాదనలపై కేంద్ర సంస్థలైన ఎన్‌డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ), పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), కో బేసిన్ రాష్ర్టాలు అభ్యంతరాలు తెలిపాయి. అయినా ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితో కేంద్రమే రంగంలోకి దిగింది. పోలవరం డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను వదులుకొని, తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏపీ అంగీకరించాలని, అప్పుడు బనచర్ల లింకు ప్రాజెక్టుకు తెలంగాణను ఒప్పిస్తామంటూ కొత్తవాదనను ముందుకు తెచ్చింది.
చంద్రబాబు వ్యాఖ్యలతో మరింత స్పష్టం
బనకచర్ల ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ అంగీకారానికి వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు సైతం తాజాగా సంకేతాలిచ్చారు. ఏపీలోని ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడులో నిర్వహించిన ఓ వేడుకలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘సెప్టెంబర్‌లో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టే ప్రాజెక్టును ప్రారంభించనున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 40 వేల కోట్లు, ప్రైవేట్ పెట్టుబడి రూ.60 వేల కోట్లతో చేపట్టనున్నాం. వచ్చే మూడేండ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నాం. ప్రస్తుతం కరువున్నా కూడా గోదావరి జలాలతో కృష్ణా డెల్టాను కాపాడాం. లీగల్ ఇబ్బందులన్నీ అధిగమిస్తున్నాం.
త్వరలోనే ప్రారంభించి, మూడేండ్లలో పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. ఉపరాష్ట్రప్రతి సైతం గోదావరి-కావేరి అనుసంధానం కావాలని కోరుకోవడం అభినందనీయం. దక్షిణ భారత సమావేశంలోనూ దీనిపై ప్రతిపాదనలు చేశాం. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరిని కలిపితే నాలుగు రాష్ర్టాల్లో సమస్య పరిష్కారమవుతుందని ప్రతిపాదించాం. దీనిపై త్వరలోనే కార్యాచరణ పూర్తిచేస్తాం’ అని నొక్కి మరీ చెప్పారు. ఈ వ్యాఖ్యల్లోనే బనకచర్ల ప్రాజెక్టు ఉన్నదని, దానికి రేవంత్ సర్కార్ రాజీపడినట్టు తేటతెల్లమవుతున్నది. బనకచర్లకు గ్రీన్‌సిగ్నల్ లభించిందని పరోక్షంగానే చంద్రబాబు స్పష్టంచేశారు.
గుట్టుగా ఏపీ కొత్త ఎత్తులు
గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉన్నారు. తొలుత పోలవరం-బనకచర్లను తెరమీదికి తీసుకొచ్చి, ఆ తర్వాత నల్లమలసాగర్గా పేరు మార్చారు. ఆ తర్వాత కేంద్రంతో ఒప్పించి దానిని గోదావరి-కావేరి నదుల అనుసంధానం పేరిట బనకచర్లకు మార్గం సుగమం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మధ్యవర్తిత్వం వ్యవహరిస్తూ పొరుగు రాష్ర్ర్టాలతో సంప్రదింపులకు చొరవ చూపించేలా ఒప్పించారు. ఈ వ్యవహారం మొత్తాన్ని ఏపీ గుట్టుగానే కొనసాగిస్తున్నది. బనకచర్లను తెరమీదికి తీసుకురాగానే తొలుత కేంద్ర సంస్థలైన సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ తదితర సంస్థలే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం బేషరతుగా వ్యతిరేకిస్తుందని ఇంజినీర్లు భావించగా, అందుకు భిన్నంగా ఏపీతో చర్చలకు సిద్ధమంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇంజినీర్లు ఎంత వారించినా కూడా అవేవీ పట్టించుకోకుండా చర్చలంటూ ముందుకు సాగారు.
బీఆర్ఎస్ హెచ్చరికలు బేఖాతరు
మొదటి నుంచీ ఏపీ ప్రతిపాదనలపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌ను హెచ్చరిస్తూనే ఉన్నది. ఏపీ కుట్రలు, కుతంత్రాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎండగడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ హెచ్చరికలు, నిపుణుల ఆం దోళనలను పెడచెవిన పెట్టిన రేవంత్ సర్కార్ ఇప్పటికీ నోరువిప్పకపోవడం ఏపీకి వత్తాసు పలుకుతుందన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. జలవివాదాల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీకి తెలంగాణ అంతర్రాష్ట్ర నదీజలాల విభాగం నుంచి కీలకమైన అధికారులకు రేవంత్ సర్కార్ చోటు కల్పించలేదు.
అయి తే తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించి, జలహక్కులను కాలరాసేందుకు యత్నించిన ఆదిత్యానాథ్ దాస్‌నే నిపుణుల కమిటీకి సిఫార్సు చేసింది. ఆనాటి నుంచి రాష్ట్ర ఇంజినీర్లతో సంబంధమే లేకుండా ఆదిత్యానాథ్ దాస్ ఒక్కరే కేంద్రంతో, ఏపీతో గుట్టుగా వ్యవహారాన్ని సాగిస్తూ వచ్చారు. అదీగాక ఇటీవల కేంద్ర జలసంఘం ఇంజినీర్లు శ్రీశైలం ప్రాజెక్టుతోపాటు, బనకచర్ల తదితర ఔట్లెట్లను సైతం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. అనంతరమే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కొనసాగింది.తాజాగా కేంద్ర జల్‌శక్తి శాఖ ఒప్పందాలకు దస్ర్తాలను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.
రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్!
ఏపీ ప్రతిపాదనలకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఇటీవల తమిళనాడు వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో దక్షిణాది రాష్ర్టాల సమావేశం సందర్భంగానే కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులే స్వయంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్టు తెలుస్తున్నది. కే సెప్టెంబర్ తొలివారంలోనే కేంద్రం సమక్షంలో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలోనే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఆ ఒప్పందాలపై సంతకాలు పెట్టేందుకు ముహూర్తం ఖరారైందని అప్పుడే వెల్లడించినట్టు సమాచారం.